ఇటివల ఇండస్ట్రీలో ‘కాస్టింగ్ కౌచ్’ లేదని మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై సీనియర్ నిర్మాత, దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండస్ట్రీలో వేధింపులు లేవని కొట్టిపారేయలేమని ఆయన స్పష్టం చేశారు. అంతే కాదు ఒకప్పుడు జమీందారులు, రాజులు కేవలం అమ్మాయిలను అనుభవించడానికే సినిమాలు తీసేవారని, ఆ పరిస్థితి ఇప్పటికీ కొందరిలో కొనసాగుతోందని ఆయన కుండబద్దలు కొట్టారు.
Also Read : Aishwarya Rajesh : డోర్ మూసేసి..బాడీ చూపించమన్నాడు..గతాన్ని గుర్తుచేసుకుని ఏడ్చేసిన ఐశ్వర్య రాజేష్!
ప్రస్తుతం ఏడాదికి 200 సినిమాలు వస్తున్నాయని, అందులో కొందరు ఎందుకు సినిమాలు తీస్తున్నారో వాళ్లకే తెలియదని.. కేవలం అమ్మాయిలను లోబర్చుకోవడానికే అలాంటి వారు ఇండస్ట్రీలోకి వస్తుంటారని తమ్మారెడ్డి విమర్శించారు. అయితే, సీరియస్‌గా సినిమాలు తీసే పెద్ద దర్శకులు, నటులు వీటికి దూరంగా ఉంటారని ఆయన అభిప్రాయపడ్డారు. గాయని చిన్మయి గురించి మాట్లాడుతూ.. ఆమె వేధింపులపై పోరాడితే నిషేధం విధించడం దారుణమని, ఆమెను చూసి మహిళలు స్ఫూర్తి పొందాలని సూచించారు. ఇండస్ట్రీలో వేధింపులు ఉన్న మాట వాస్తవమే అని, కానీ టాలెంట్ ఉంటే ఎవరూ తొక్కలేరని ఆయన పేర్కొన్నారు. ఎవరికైనా సమస్య వస్తే తాము అండగా ఉంటామని, అందరం కలిసి ఈ సమస్యను పరిష్కరించాలని ఆయన పిలుపునిచ్చారు.
