Tamil Nadu Fan Couples Exchanges Garlands and Rings at Leo Movie Theatre: క్రికెట్, సినిమా.. రంగం ఏదైనా ఫ్యాన్స్ అభిమానం ఇటీవలి కాలంలో మితిమీరుతుంటుంది. బారికేడ్స్ దాటి తమ అభిమాన క్రికెటర్ వద్దకు కొందరు ఫాన్స్ పరుగెత్తుతున్నారు. తన అభిమాన హీరో లేదా హీరోయిన్‌తో సెల్ఫీ దిగేందుకు ఫ్యాన్స్ ఎంతకైనా తెగించేస్తున్నారు. అయితే తాజాగా ఓ జంట వినూత్నంగా ఆలోచించింది. తన ఫెవరెట్ హీరో సినిమా రిలీజ్ మొదటి రోజున థియేటర్‌లో అందరిముందు దండలు, ఉంగరాలు మార్చుకున్నారు. ఈ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది.
తమిళనాడు పుదుకుట్టై జిల్లాకు చెందిన వెంకటేష్, మంజులకు దళపతి విజయ్ అంటే చాలా చాలా ఇష్టం. వీరి ఎంగేజ్‌మెంట్ ఈ ఏడాది ఆరంభంలోనే జరిగింది. వెంకటేష్, మంజుల జంట విజయ్ ఫ్యాన్స్ కాబట్టి.. పెళ్లి ‘లియో’ సినిమా విడుదల తర్వాతే చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసమే గత ఎనిమిది నెలలుగా వారు ఎదురుచూస్తున్నారు. అక్టోబర్ 20న పెళ్లి ముహూర్తం ఉండగా.. గురువారం (అక్టోబర్ 19) లియో సినిమా విడుదల అయింది.
లియో సినిమా బెనిఫిట్ షోకు వెంకటేష్, మంజులలు సాంప్రదాయ దుస్తుల్లో థియేటర్‌కు వచ్చారు. బంధువులు, స్నేహితులు, ప్రేక్షకుల మధ్య యువ జంట దండలు, ఉంగరాలు మార్చుకున్నారు. ఆ తర్వాత స్నేహితులు, బంధువులతో కలిసి లియో సినిమా వీక్షించారు. ప్రస్తుతం దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోపై భిన్న కామెంట్స్ వస్తున్నాయి. ‘పిచ్చి పీక్స్ అంటే ఇదే’, ‘మీ అభిమానం తగలెయ్య’, ‘ఎంత అభిమానం ఉంటే.. సాంప్రదాయాలు పాటించరా?’ అంటూ నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. ఇక విజయ్-లోకేశ్ కనగరాజ్‌ల కాంబోలో తెరకెక్కిన లియో నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది.
#WATCH | Pudukkottai, Tamil Nadu: A fan couple of actor Vijay exchanges garlands and rings in the theatre during the screening of his movie ‘Leo’, released today pic.twitter.com/mZEafBLbks
— ANI (@ANI) October 19, 2023