NTV Telugu Site icon

West Godavari: టీడీపీ-జనసేన తొలి జాబితా.. పశ్చిమలో అయోమయం..!

Tdp Js

Tdp Js

West Godavari: టీడీపీ-జనసేన ప్రకటించిన తొలిజాబితాలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో ఆరు అసెంబ్లీ స్థానాలను టీడీపీ ప్రకటించింది. అయితే జిల్లా ఒక్కసీటునుకూడా జనసేన నుంచి ప్రకటించకపోవడంతో ఇరు పార్టీల అభ్యర్ధుల్లోనూ అయోమయం కొనసాగుతోంది. జిల్లాలో మిగిలిన తొమ్మిది అసెంబ్లీలలో జనసేనకు ప్రకటించే సీట్లు ఎన్ని, టీడీపీకి కేటాయించేవి ఎన్ని అనే చర్చ వాడివేడిగా సాగుతోంది. ఉమ్మడి జాబితాలో టిడిపి నుంచి ఏలూరు, ఉండి, ఆచంట, తణుకు,చింతలపూడి, పాలకొల్లు నియోజకవర్గాల్లో అభ్యర్ధులను ఫైనల్ చేశారు.. ఉండి నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే మంతెన రామరాజు క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన నేతకాగా.. పాలకొల్లు నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు కాపు సామాజిక వర్గానికి చెందిన నేతగా ఉన్నారు. ఇక ఏలూరు నుంచి బడేటి రాధాకృష్ట కాపు సామాజిక వర్గానికి చెందిన నేతగా, తణుకు నుంచి మాజీ ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ట కమ్మ సామాజిక వర్గానికి చెందినవారుకాగా, చింతలపూడి నుంచి సొంగా రోషన్ కుమార్ ఎస్సీ, ఆచంట నుంచి మాజీ మంత్రి పితాని సత్యనారాయణ బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతలుగా ఉన్నారు. ఇప్పటి వరకు ప్రకటించిన ఆరు స్థానాల్లో కమ్మ-1, కాపు-2, బీసీ-1, ఎస్సీ-1, క్షత్రియ-1 చొప్పున ఉన్నారు.

నియోజకవర్గాల్లో ప్రకటించిన టిడిపి అభ్యర్ధుల బలాబలాలు ఒక్కసారి చూస్తే 2014నుంచి 19వరకు ఏలూరు ఎమ్మెల్యేగా పనిచేసిన బడేటి బుజ్జి అనారోగ్యకారణాలతో మృతి చెందారు. ఆయన సోదరుడిగా రాజకీయాల్లో అడుగుపెట్టిన బడేటి రాధాకృష్ట అలియాస్ బడేటి చంటి వచ్చే ఎన్నికల్లో టిడిపి తరఫున ఏలూరు అసెంబ్లీ నుంచి బరిలో దిగిబోతున్నారు. వ్యాపారవేత్తగా ఉన్న బడేటి చంటి తన అన్నయ్య ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో క్షేత్రస్థాయి రాజకీయాలను చక్కబెడుతూ ఉండేవారు. మాజీ ఎమ్మెల్యే బుజ్జి మృతి తర్వాత వెరైటీ చంటికి టిడిపి అవకాశం కల్పించింది. వ్యాపారవేత్తుగా ఉంటూ రాజకీయాల్లో ఉంటున్న చంటి గడిచిన రెండు మూడేళ్ళుగా ఏలూరు నియోజకవర్గ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ జనసేన సీటు ఆశించినప్పటికి టిడిపి అభ్యర్ది బడేటి చంటికే అవకాశం దక్కింది.వచ్చే ఎన్నికల్లో బడేటి చంటి తొలిసారి ఎమ్మెల్యే అభ్యర్ధిగా బరిలో దిగబోతున్నారు.

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో మరో కీలక నియోజకవర్గం చింతలపూడి నియోజకవర్గంగా ఉన్న ఈ సెగ్మెంట్లో తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్ఆర్ఐ సొంగా రోషన్ కుమార్ కు అవకాశం ఇస్తూ తెలుగుదేశం పార్టీ అతని పేరుని ప్రకటించింది. గత ఎన్నికల్లోనే టిడిపి టికెట్ ఆశించిన సొంగారోషన్ కుమార్ అవకాశం దక్కలేదు. అప్పటినుంచి పార్టీని అంటిపెట్టుకు తిరుగుతున్న రోషన్ కుమార్ వచ్చే ఎన్నికల్లో టిడిపి తరఫున బరిలో దిగిబోతున్నారు. విదేశాల్లో వ్యాపారాలు చేసి డబ్బులు సంపాదించి రోషన్ కుమార్ ఇపుడు టిక్కెట్ దక్కడంతో తొలిసారి అసెంబ్లీ బరిలో దిగబోతున్నారు. మాజీ మంత్రి పితాని సత్యనారాయణ ఆచంట నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున మరోసారి పోటీలో దిగిబోతున్నారు. గత ఎన్నికల్లో వైసిపి అభ్యర్థి చెరుకువాడ శ్రీరంగనాథరాజు చేతిలో ఓటమిపాలైన పితాని వచ్చే ఎన్నికల్లో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలో మంత్రిగా పనిచేసిన అనుభవంతో పాటు బీసీ సామాజిక వర్గానికి చెందిన పితాని సత్యనారాయణ స్థానికంగా బలమైన నేతగా గుర్తింపు ఉంది. అయితే అతి విశ్వాసం కారణంగా ఇటీవల ఆయన చేస్తున్న వ్యాఖ్యలు పార్టీ క్యాడర్‌ను అయోమయంలో పడేస్తున్నాయి. ఆచంటలో బిసి ఓటర్లదే హవా. ఇప్పటికి ఆరు సార్లు అసెంబ్లీ బరిలో దిగిన పితాని మూడు సార్లు విజయంసాధించి మూడు సార్లు ఓటమిపాలయ్యారు.

2014, 2019 ఎన్నికల్లో వరుసగా రెండుసార్లు పాలకొల్లు నుంచి విజయం సాధించిన నిమ్మల రామానాయుడుకు ముచ్చటగా మూడోసారి అవకాశం కల్పిస్తూ టిడిపి నిర్ణయం తీసుకుంది. తెలుగుదేశం పార్టీలో కాపు సామాజిక వర్గానికి చెందిన బలమైన నేతగా నిమ్మల రామానాయుడు ఉన్నారు. గత ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యాను గాని వీచినా పాలకొల్లులో నిమ్మల రామానాయుడు టిడిపి జెండాను ఎగరేశారు. నిత్యం ప్రజా సమస్యల పైన పోరాడుతూ తనదైన మార్కు చూపిస్తూ వస్తున్నారు. పార్టీ కష్టకాలంలో ఉన్నసమయంలోనూ రామానాయుడు వెనుకడుగు వేయకుండా పనిచేస్తూ వచ్చారు. పార్టీలో కీలక నేతగా , పాలకొల్లులో తిరుగులేని నేతగా ఉన్నారు. పాలకొల్లు వైసిపి నుంచి వ్యాపారవేత్త గుడాల గోపి వచ్చే ఎన్నికల్లో తొలిసారి బరిలో దిగిబోతున్నారు. శెట్టిబలిజ సామాజిక వర్గానికి చెందిన గుడాల గోపికి పాలకొల్లులో వర్గ పోరు ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. వ్యాపార వేత్తగా ఉంటూ ఇపుడు రాజకీయాల్లో అడుగుపెట్టిన గుడాల గోపికి ఇదే తొలి ఎన్నిక. ఇప్పటికే పార్టీలో క్యాడర్‌ను తనవైపు తిప్పుకునేప్రయత్నాలు చేస్తున్నా ఫలితం ఆశించిన స్థాయిలో ఉండట్లేదనే చెప్పాలి. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి మూడోసారి పోటీ చేయబోతున్న నిమ్మల రామానాయుడుపై గుడాల గోపి ఎంతవరకు పై చేయి సాధిస్తారో అనేది చూడాలి.

తణుకు అసెంబ్లీ నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ వచ్చే ఎన్నికల్లో బరిలో దిగిబోతున్నారు. కమ్మ సామాజిక వర్గానికి చెందిన అరిమిల్లి బలమైన నేతగా నియోజకవర్గంలో పేరు ఉంది. 2014లో గెలిచిన అరిమిల్లి గత ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన విడివిడిగా పోటీ చేయడంతో స్వల్ప మెజారిటీతో వైసిపి అభ్యర్థి కారుమూరి నాగేశ్వరరావు పై అరిమిల్లి రాధాకృష్ణ ఓటమి పాలయ్యారు. తణుకు సీటును జనసేన ఆశించినప్పటికి టిడిపి పట్టుదలతో ఈసీటును తమ ఖాతాలో వేసుకుంది.ఎన్.ఆర్.ఐగా ఉండే అరిమిల్లి 2014లో 30వేల ఓట్లతో గెలిచారు. 2019లో రెండున్నర వేల ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు. వచ్చే ఎన్నికల్లో జనసేన టిడిపి కలిసి పోటీ చేస్తున్న నేపథ్యంలో తణుకులో తెలుగుదేశం పార్టీ జెండా ఎగురుతుందని నమ్మకంతో ఉన్నారు. ఉండి అసెంబ్లీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే మంతెన రామరాజుకు మరోసారి అవకాశం కల్పించింది టిడిపి. 2019లో వైసీపీ ప్రభంజనంలోనూ రామరాజు తెలుగుదేశం జెండా ఎగరేశారు. అప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న కలవపూడి శివ యంపిగా వెళ్లడంతో రామరాజుకు అవకాశం వచ్చింది. ఫ్యానుగాలి హోరులోనూ ఉండి అసెంబ్లీలో రామరాజు జెండా ఎగరేసారు.నియోజకవర్గంలో బలమైన నేతగా ఉన్న రామరాజు వచ్చే ఎన్నికల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఉండి సగ్మెంట్లో టిడిపి ఒక్కసారి మాత్రమే ఓటమిపాలయ్యింది. వచ్చే ఎన్నికల్లో జనసేన టిడిపి కలసి వెళ్తున్న నేపద్యంలో టిడిపికి మరింత అడ్వాంటేజ్ కానుంది.