AP Eelctions: మొదటి రోజే రణరంగంగా పల్నాడు.. విప్పర్లలో పెట్రోల్ బాంబుల కలకలం..

Ap Mayor Elections 2026

Ap Mayor Elections 2026

పల్నాడు జిల్లా నరసరావుపేట నియోజకవర్గంలో పంచాయతీ ఎన్నికల నామినేషన్ల మొదటి రోజే తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. జిల్లాలోని రొంపిచర్ల మండలం విప్పర్ల గ్రామంలో సర్పంచ్ పదవికి నామినేషన్ వేసే విషయంలో టీడీపీలోని రెండు వర్గాల మధ్య తలెత్తిన విభేదాలు హై టెన్షన్‌కు దారితీశాయి. ఇరువర్గాలు భారీ సంఖ్యలో నామినేషన్ కేంద్రం వద్దకు చేరుకోవడంతో వాతావరణం వేడెక్కింది.

నామినేషన్ వ్యవహారంలో ఇరువర్గాల మధ్య మాటామాటా పెరిగి ఘర్షణ వాతావరణం ఏర్పడటంతో పోలీసులు వెంటనే రంగంలోకి దిగి ఇరువర్గాలను చెదరగొట్టారు. అనంతరం ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గ్రామంలో పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. ఇదే క్రమంలో పల్నాడు జిల్లా అడిషనల్ ఎస్పీ రోహిత్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు విప్పర్లలో ఇంటింటి తనిఖీలు చేపట్టగా, టీడీపీలోని ఒక వర్గం వద్ద దాచి ఉంచిన పెట్రోల్ బాంబులు, కర్రలు, ఇతర మారణాయుధాలు బయటపడటంతో వాటిని స్వాధీనం చేసుకున్నారు.

మరోవైపు, నరసరావుపేట మండలం ఇసప్పాలెం వద్ద కూడా నామినేషన్ల ప్రక్రియ సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ములకలూరుకు చెందిన వైసీపీ నేతలు, కార్యకర్తలు భారీగా తరలివచ్చి నామినేషన్ వేసేందుకు ఇసప్పాలెం కేంద్రానికి చేరుకున్నారు. అయితే, ఎన్నికల నిబంధనల ప్రకారం నామినేషన్ కేంద్రంలోకి కేవలం ముగ్గురికి మాత్రమే అనుమతి ఉందని పోలీసులు స్పష్టం చేస్తూ వారిని అడ్డుకున్నారు. తమ అందరినీ లోపలికి అనుమతించాలంటూ వైసీపీ వర్గీయులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ సమయంలో అక్కడే ఉన్న టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య తోపులాట జరిగింది.

దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ములకలూరు వైసీపీ వర్గీయులు ఇసప్పాలెం నామినేషన్ కేంద్రం ఎదుట రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. టీడీపీ వర్గీయులకు, పోలీసులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చివరకు పోలీసు ఉన్నతాధికారులు ఆందోళన చేస్తున్న వైసీపీ వర్గీయులకు నచ్చజెప్పి సర్దిచెప్పడంతో వివాదం సద్దుమణిగింది.