Jaggareddy: రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా సాగుతున్న వేళ సంగారెడ్డిలో మాత్రం హైడ్రామా చోటు చేసుకుంది. పోలింగ్ కేంద్రం వద్ద పోలీసుల తీరును నిరసిస్తూ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆందోళనకు దిగడంతో అక్కడ పరిస్థితి యుద్ధ వాతావరణాన్ని తలపించింది.
Huzurabad: ఆక్సిజన్ సిలిండర్‌తో వచ్చి ఓటు హక్కు వినియోగం.. ఆదర్శంగా నిలిచిన వృద్ధురాలు!
సంగారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని 34వ వార్డు పోలింగ్ స్టేషన్ వద్ద ఈ గొడవ మొదలైంది. కాంగ్రెస్ అభ్యర్థి పట్ల సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (సీఐ) శివకుమార్ దురుసుగా ప్రవర్తించారని, ఏకంగా ఆయన కాలర్ పట్టుకున్నారని జగ్గారెడ్డి ఆరోపించారు. బీఆర్ఎస్ అభ్యర్థి రిగ్గింగ్‌కు పాల్పడుతుంటే, సీఐ ఆయనకు సహకరిస్తున్నారని జగ్గారెడ్డి మండిపడ్డారు. అభ్యర్థికి జరిగిన అవమానాన్ని నిరసిస్తూ జగ్గారెడ్డి బలవంతంగా పోలింగ్ బూత్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా, పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య తీవ్ర తోపులాట, వాగ్వాదం జరిగింది.
ఘటనా స్థలానికి కాంగ్రెస్ శ్రేణులు భారీగా చేరుకోవడంతో ఉద్రిక్తత మరింత పెరిగింది. రిగ్గింగ్‌కు సహకరించిన సీఐ శివకుమార్‌ను వెంటనే సస్పెండ్ చేయాలని జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. పోలీసులే ఏకపక్షంగా వ్యవహరిస్తే ఇక ఎన్నికలు ఎందుకు? సీఐని సస్పెండ్ చేయకపోతే ఎన్నికలను బహిష్కరిస్తాం అంటూ ఆయన హెచ్చరించారు. ఈ ఘటనపై మీడియాలో వస్తున్న వార్తలు, ఫిర్యాదులపై రాష్ట్ర ఎన్నికల సంఘం తక్షణమే స్పందించింది.
సంగారెడ్డిలో జరిగిన సంఘటనపై పూర్తి స్థాయి నివేదిక సమర్పించాలని పోలీసు ఉన్నతాధికారులను ఈసీ ఆదేశించింది. క్షేత్రస్థాయిలో అసలు ఏం జరిగింది? పోలీసుల ప్రవర్తన ఎలా ఉంది? అనే అంశాలపై విచారణ చేపట్టాలని సూచించింది. అక్కడ ఎలాంటి గొడవలు కలగకుండా అదనపు బలగాలను మోహరించాలని ఆదేశాలు జారీ చేసింది.
