NTV Telugu Site icon

NEET Result 2024: నీట్ లో మెరిసిన తెలుగు తేజాలు.. ఏపీలో నలుగురికి ఒకటో ర్యాంక్

Results

Results

వైద్య విద్యనభ్యసించి పేద వారికి వైద్య సేవలందించాలని కొందరు తహతహలాడుతుంటారు. ఇందుకోసం రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు నిర్వహించే ఎంట్రెన్స్ పరీక్షలను రాస్తుంటారు. వైద్య విద్య కోసం దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ యూజీ పరీక్షను నిర్వహిస్తారు. నీట్ యూజీ పరీక్ష మే 5, 2024న జరిగింది. తాజాగా నీట్ పరీక్ష ఫలితాలను మంగళవారం నేషనల్ టెస్టింగ్ ఏజన్సీ విడుదల చేసింది. నీట్ అభ్యర్థులు exams.nta.ac.in/NEETలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను చూడొచ్చు.

READ MORE: India Alliance Meeting: నేడు ఇండియా కూటమి సమావేశం.. ఎన్టీయే మిత్రపక్షాలకు గాలం!

దేశవ్యాప్తంగా ఈసారి 23.33 లక్షల మంది పరీక్ష రాశారు. వారిలో 13.16 లక్షల మంది ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 67 మందికి సమాన పర్సంటైల్‌(99.997129) దక్కడంతో వారందరికీ ఒకటో ర్యాంకు కేటాయించారు. వారిలో 14 మంది అమ్మాయిలు, 53 మంది అబ్బాయిలు. ఒకటో ర్యాంకు సాధించిన వారిలో నలుగురు ఏపీ విద్యార్థులున్నారు. రాజస్థాన్‌ నుంచి అత్యధికంగా 11 మంది విద్యార్థులున్నారు. తెలంగాణ రాష్ట్రం నుంచి ఈసారి 100లోపు ర్యాంకుల్లో కేవలం ఒకటి మాత్రమే దక్కింది. హైదరాబాద్‌ నుంచి పరీక్ష రాసిన అనురన్‌ ఘోష్‌ 77వ ర్యాంకు సాధించాడు. ఎన్‌టీఏ కేటగిరీల వారీగా టాప్‌ 10 ర్యాంకులను ప్రకటించింది. ఎస్‌టీ కేటగిరీలో తెలంగాణకు చెందిన గుగులోతు వెంకట నృపేష్‌ 167వ ర్యాంకు, లావుడ్య శ్రీరామ్‌ నాయక్‌ 453వ ర్యాంకు సాధించి దేశవ్యాప్తంగా తొలి రెండు స్థానాలు సాధించిన వారి జాబితాలో నిలిచారు.

తెలంగాణ నుంచి నీట్‌ యూజీ పరీక్షకు హాజరైన విద్యార్థుల్లో 60.84 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. మొత్తం 79,813 మంది దరఖాస్తు చేసుకోగా.. 77,849 మంది పరీక్ష కు హాజరయ్యారు. వారిలో 47,371 మంది కనీస మార్కులు సాధించి ఎంబీబీఎస్, బీడీఎస్‌ తదితర కోర్సుల్లో ప్రవేశానికి అర్హత పొందారు. గత నెల 5వ తేదీన నీట్‌ యూజీ జరిగింది.