NTV Telugu Site icon

Telegram CEO: పెళ్లి కాలేదు కానీ, 12 దేశాల్లో 100 మంది పిల్లలున్నారు.. టెలిగ్రామ్ సీఈవో సంచలన ప్రకటన

Telegram Ceo

Telegram Ceo

Telegram CEO: ప్రముఖ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు, సీఈవో పావెల్ దురోవ్‌ మంగళవారం సంచలన ప్రకటన చేశారు. తనకు వివిధ దేశాల్లో 100 మందికి పైగా సొంత పిల్లలున్నారని తన మిలియన్ల మంది సబ్‌స్కైబర్లకు చెప్పారు. తన బయోలాజికల్ పిల్లల గురించి పలు వివరాలను తన సుదీర్ఘ పోస్ట్‌లో వారితో పంచుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా 12 దేశాల్లోని 100 మందికి పైగా పిల్లలకు బయోలాజికల్‌గా తాను తండ్రినని తెలిపారు. ఈ విషయం ఈ మధ్యనే తెలిసిందని వెల్లడించారు. పెళ్లి కాకుండా ఇదంతా ఎలా సాధ్యమైందో ఈ పోస్ట్‌లో ఆయన వివరంగా రాశారు. వీర్యదానం ద్వారా 100 మందికి పైగా పిల్లలకు తాను బయోలాజికల్ తండ్రి అయ్యానని.. అంతేకాకుండా, తన పిల్లలు ఒకరినొకరు మరింత సులభంగా కనుగొనడానికి వీలుగా తన డీఎన్‌ఏను ఓపెన్‌ సోర్సింగ్ చేస్తానని చెప్పారు.

Read Also: Wayanad Landslides: 88కు చేరిన మృతుల సంఖ్య.. రెండు రోజులు సంతాప దినాలు ప్రకటించిన ప్రభుత్వం

15 ఏళ్ల క్రితం తన స్నేహితుడు ఓ విచిత్రమైన రిక్వెస్ట్‌తో తన దగ్గరకు వచ్చాడని.. సంతానోత్పత్తి సమస్య కారణంగా తనకు, తన భార్యకు పిల్లలు పుట్టలేదని, తమకు బిడ్డ బిడ్డ పుట్టడానికి క్లినిక్‌లో తన వీర్యాన్ని దానం చేయాలని కోరాడని ఆయన చెప్పారు. తను జోక్ చేస్తున్నాడేమో అనుకుని, గట్టిగా నవ్వేశానని… కానీ, అతడు సీరియస్ గానే ఆ రిక్వెస్ట్ చేశాడంటూ టెలిగ్రామ్ సీఈఓ డురోవ్ తెలిపాడు. వీర్యదానం చేసేందుకు క్లినిక్‌కు వెళ్లినప్పుడు తనది అత్యంత నాణ్యత కలిగిన వీర్యం అని తేలిందని పావెల్‌ దురోవ్ వివరించాడు. ఈ క్రమంలోనే తనకు పెద్ద సంఖ్యలో వీర్యదానం చేయాలన్న అభ్యర్థనలు వచ్చాయని, మొదట్లో ఇదంతా విచిత్రంగా అనిపించిదని చెప్పారు. అనంతరం ప్రపంచవ్యాప్తంగా సంతానోత్పత్తి సమస్య ఉన్న జంటలకు సహాయపడుతుందని అర్థమైన అనంతరం.. ఆ సమస్యను సీరియస్‌గా తీసుకున్నానని చెప్పారు. అలా ఇప్పటివరకు 12 దేశాల్లో వందమందికి పైగా జంటలకు సంతానాన్ని అందించానని వెల్లడించారు. చాలా ఏళ్ల క్రితమే వీర్యదానాన్ని నేను ఆపినప్పటికీ.. ఇంకా ఫ్రీజ్‌ చేసిన నా కణాలతో ఎన్నో కుటుంబాలకు సంతానం కలిగిస్తున్నారని తెలుసుకున్నానని టెలిగ్రామ్ సీఈవో పావెల్ దురోవ్ చెప్పుకొచ్చారు. తన డీఎన్ఏను ఓపెన్ సోర్స్ చేయాలనే తన ఆలోచనను డురోవ్ బయటపెట్టాడు. భవిష్యత్‌లో తన బయోలాజికల్ పిల్లలకు ఏవైనా ఆరోగ్య సమస్యలు తలెత్తితే, ఉపయోగపడేందుకు వీలుగా తన డీఎన్‌ఏను ఓపెన్ సోర్స్ చేయనున్నట్లు దురోవ్ వెల్లడించారు.

వీర్యదానం విషయాన్ని బయటపెట్టడంతో కొంత రిస్క్ ఉన్నప్పటికీ.. వీర్యదాత అయినందుకు తానేం పశ్చాత్తాపపడట్లేదన్నారు. ప్రపంచ పరిస్థితుల్లో సంతానలేమి సమస్య తీవ్రంగా ఉందని గమనించి.. అలాంటి వారికి పిల్లలను ఇచ్చిన వారి ఇంట సంతోషం తెచ్చినందుకు గర్వపడుతున్నానన్నారు. మరింత ఎక్కువ మంది వీర్య దానానికి ముందుకు రావాలని కోరుతున్నానని దురోవ్ పేర్కొన్నారు. దీనిపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని ఆయన రాసుకొచ్చారు. ఈ పోస్ట్‌ నెట్టింట వైరల్‌గా మారంది.