NTV Telugu Site icon

Weather Updates : తెలంగాణలో మూడు రోజులు వర్షాలు

తెలంగాణలో రానున్న మూడు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాలు విస్తరించాయి. ఈరోజు ఉత్తర అరేబియా సముద్రం, మహారాష్ట్రలోని మరికొన్ని ప్రాంతాల్లో రుతుపవనాలు విస్తరించనున్నాయి. నాసిక్, నిజామాబాద్, సుకుమా, విజయనగరం, ఇస్లాంపూర్ వరకు విస్తరించనున్నట్లు పేర్కొంది. నైరుతి రుతుపవనాల విస్తరణ నేప+థ్యంలో మూడ్రోజుల పాటు వర్షం కురిసే అవకాశముందని తెలిపింది. గంటకు 30 కిలో మీటర్ల నుంచి 40 కిలో మీటర్ల వేగంతో… ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. నల్గొండ, సూర్యాపేట, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాలలో వర్షం కురిసే అవకాశముందని తెలిపింది.

ఇదిలా ఉంటే.. సోమవారం కాప్రా, ఘట్‌కేసర్‌, చర్లపల్లి, పరిసర ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఘట్‌కేసర్‌లో రికార్డు స్థాయిలో 90.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, సోమవారం సాయంత్రం కొద్ది గంటల వ్యవధిలో కాప్రాలో 60.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కాప్రా, చెర్లపల్లి పరిధిలోని దమ్మాయిగూడ, నాగారం, ఈసీఐఎల్, జవహర్ నగర్, బొల్లారం, అల్వాల్, మౌలా అలీ తదితర ప్రాంతాల్లో సోమవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. అయితే, విచిత్రమేమిటంటే, RK పురం, త్రిముల్‌ఘేరి, సఫిల్‌గూడ, మల్కాజ్‌గిరి వంటి అనేక సమీప ప్రాంతాలలో తేలికపాటి జల్లులు మాత్రమే నమోదయ్యాయి.