NTV Telugu Site icon

Shridhar Babu: ప్రపంచంలోనే అతి పెద్ద కళ్లజోడు తయారీ యూనిట్.. 2వేల ఉద్యోగాలు పక్కా!

Shridhar Babu

Shridhar Babu

రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధిని ప్రోత్సహిస్తూ తెలంగాణ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించడమే మా లక్ష్యమని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అనుకూల పరిస్థితులున్నాయని తెలిపారు. ఈ రోజు ఆయన మాట్లాడుతూ.. “పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా అండగా ఉంటాం. ఇక్కడ పెట్టుబడులు పెట్టి “తెలంగాణ రైజింగ్”లో భాగస్వామ్యం కావాలని పారిశ్రామికవేత్తలకు విజ్ఞప్తి చేస్తున్నా. తెలంగాణలో ఏర్పాటు చేస్తున్న పరిశ్రమల్లో స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు దక్కేలా ప్రభుత్వం చొరవ తీసుకుంటుంది. లెన్స్ కార్ట్ ప్రపంచంలోనే అతి పెద్ద కళ్లజోడుల తయారీ కేంద్రాన్ని తెలంగాణలో ఏర్పాటు చేసేందుకు ముందుకు రావడం అభినందనీయం. దీంతో తెలంగాణ బ్రాండ్ విశ్వ వ్యాప్తంగా అవుతుంది. ఈ ప్లాంట్ ఏర్పాటుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం, లెన్స్‌కార్ట్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ మధ్య గతేడాది డిసెంబర్ 8న ఒప్పందం (MOU) కుదిరింది.” అని శ్రీధర్ బాబు స్పష్టం చేశారు.

READ MORE: MLA Quota MLC Elections 2025: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలపై టీడీపీ ఫోకస్.. వారికి ఈ సారి డౌటే..?

ఇప్పటికే లెన్స్‌కార్ట్ కు రాజస్థాన్‌లో అధునాతన కళ్లజోడు తయారీ యూనిట్‌ ఉంది. కానీ.. మన దగ్గర ఏర్పాటు కాబోయే ప్లాంట్ ప్రపంచంలోనే అతిపెద్ద ప్లాంట్ అని ఐటీ శాఖ మంత్రి స్పష్టం చేశారు. అత్యాధునిక టెక్నాలజీతో ఏర్పాటు కానున్న ఈ ప్లాంట్ తెలంగాణకు తలమానికం అవుతుందని.. తయారీ రంగంలో తెలంగాణను మరింత ముందుకు తీసుకెళ్తుందన్నారు. రూ.1500 కోట్లతో ఏర్పాటు చేయబోయే ప్లాంట్ ద్వారా సుమారు 2వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని వెల్లడించారు. ఈ ప్లాంట్ కు ప్రభుత్వం తరఫున తుక్కుగూడ సమీపంలో రావిర్యాలలో 50 ఎకరాలు కేటాయించినట్లు తెలిపారు. రెండేళ్లలో ఈ ప్లాంట్ లో ఉత్పత్తి ప్రారంభం అవుతుంది. నాలుగేళ్లలో పూర్తిగా కార్యకలాపాలు మొదలవుతాయన్నారు. ఇక్కడ తయారయ్యే ఉత్పత్తులు జపాన్, సింగపూర్, థాయ్‌లాండ్, తైవాన్, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, మలేషియా, వియత్నాం, UAE, సౌదీ అరేబియా దేశాలకు ఎగుమతి అవుతాయని వెల్లడించారు.