CM Revanth Reddy: తెలంగాణను సమగ్రంగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్రాన్ని మూడు రీజియన్లుగా విభజించి ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థలో తెలంగాణ పాత్ర కూడా కీలకంగా ఉంటుందని ఆయన తెలిపారు. 2034 నాటికి రాష్ట్రాన్ని వన్ ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, దేశానికి స్వాతంత్ర్యం వచ్చి వందేళ్లు పూర్తయ్యే ఎంతో ప్రాధాన్యమున్న 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే తమ ప్రధాన టార్గెట్ అని ముఖ్యమంత్రి వెల్లడించారు. గురువారం ఏర్పాటు చేసిన ఇండియన్ రోడ్స్ కాంగ్రెస్ కార్యక్రమంలో సీఎం ప్రసంగించారు.
రాష్ట్ర అభివృద్ధి కోసం తెలంగాణను ‘క్యూర్’, ‘ప్యూర్’, ‘రేర్’ అనే మూడు భాగాలుగా విభజించినట్లు రేవంత్ రెడ్డి వివరించారు. ఇందులో భాగంగా ఓఆర్ఆర్ (ORR) పరిధిలోని ప్రాంతాన్ని ‘క్యూర్’గా పేర్కొంటూ ఇక్కడ సేవా రంగాలకు (సర్వీస్ సెక్టార్) అత్యంత ప్రాధాన్యం ఇస్తామన్నారు. ఓఆర్ఆర్ నుంచి రీజినల్ రింగ్ రోడ్డు (RRR) వరకు ఉన్న ప్రాంతాన్ని ‘ప్యూర్’గా విభజించి, ఇక్కడ తయారీ రంగానికి (మాన్యుఫ్యాక్చరింగ్) పెద్దపీట వేస్తామని తెలిపారు. అలాగే ఆర్ఆర్ఆర్ వెలుపల ఉన్న ప్రాంతాన్ని ‘రేర్’గా పరిగణిస్తూ అక్కడ వ్యవసాయం, వ్యవసాయ ఆధారిత పరిశ్రమల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు.
రాష్ట్రంలో ఆర్ అండ్ బీ శాఖ కేవలం రహదారుల నిర్మాణమే కాకుండా అనేక ఇతర శాఖల పనులను కూడా సమర్థవంతంగా చేపడుతోందని సీఎం తెలిపారు. రహదారులతో పాటు ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. వైద్య రంగంలో భాగంగా రాష్ట్రంలో నిర్మిస్తున్న నూతన ఉస్మానియా, టిమ్స్ (TIMS), ఇతర ఆసుపత్రులన్నింటిలో కలిపి మొత్తం 8,000 పడకలను (బెడ్స్) ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు వెల్లడించారు.
దేశ భద్రత, జాతి ప్రయోజనాల విషయంలో రాజకీయాలకు ఏమాత్రం తావు లేదని, రాజకీయాలు కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే ఉండాలని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనుల గురించి తమ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇప్పటికే వివరించారని, వాటికి అందరూ సంపూర్ణ మద్దతు ఇవ్వాలని కోరారు. ఇక రాష్ట్రానికి భారీగా పెట్టుబడులను ఆకర్షించేందుకు డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్’ నిర్వహించబోతున్నట్లు ప్రకటించారు. దేశాభివృద్ధిలో, పెట్టుబడుల సాధనలో ఈ సదస్సు ఎంతో కీలకం కానుందని పేర్కొంటూ, ఈ గ్లోబల్ సమ్మిట్‌కు రావాల్సిందిగా అందరినీ ముఖ్యమంత్రి ఆహ్వానించారు.

