Site icon NTV Telugu

Village Volunteer: ‘ప్రతీ గ్రామానికి ఒక వాలంటీర్‌ను నియమిస్తాం’: మంత్రి తుమ్మల

Tummala Nageswara Rao

Tummala Nageswara Rao

తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి గ్రామానికి ఒక ‘సాయిల్ హెల్త్ వాలంటీర్‌’ను నియమించి, నేల ఆరోగ్యంపై రైతులకు సమగ్ర అవగాహన కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు స్పష్టం చేశారు. సోమవారం పటాన్‌చెరులోని ఇక్రిశాట్ (ICRISAT)లో రాష్ట్ర వ్యవసాయ శాఖ సంయుక్తంగా నిర్వహించిన ప్రత్యేక శిక్షణా కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నేల సారం కేవలం పంట దిగుబడికే కాకుండా మానవ ఆరోగ్యం, పర్యావరణ సమతుల్యతపై నేరుగా ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. ప్రతి రెవెన్యూ గ్రామం నుంచి వాలంటీర్లను ఎంపిక చేసి, రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 30 వేల మందికి శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఏడాది 4 లక్షల మట్టి నమూనాలను సేకరించి పరీక్షలు నిర్వహించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన తెలిపారు.

ముఖ్యంగా వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం నుండి 120 మంది రైతులు తొలి దశలో వాలంటీర్లుగా శిక్షణ పొందుతున్నారు. ‘తెలంగాణ రైజింగ్ విజన్ 2047’లో భాగంగా సాగు ఖర్చులు తగ్గించి రైతు ఆదాయం పెంచడమే లక్ష్యమని మంత్రి చెప్పారు. రసాయన ఎరువుల వాడకం తగ్గించి, జీలుగ, జనుము వంటి పచ్చిరొట్ట ఎరువుల ద్వారా నేల సారాన్ని పెంచుకోవాలని సూచించారు. ఈ వాలంటీర్లు గ్రామ స్థాయిలో రైతులకు నేల యాజమాన్య పద్ధతులపై అవగాహన కల్పిస్తూ, తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు సాధించేలా తోడ్పడతారని మంత్రి ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఇక్రిశాట్ డైరెక్టర్ జనరల్ డా. హిమాన్షు పాఠక్ మరియు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Exit mobile version