Site icon NTV Telugu

తెలంగాణలో విశ్రాంత అధికారులు కీలక పదవుల్లోకి..

Tg Govt

Tg Govt

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం, అనుభవజ్ఞులైన విశ్రాంత ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు కీలక పదవులు అప్పగిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. విశ్రాంత ఐఏఎస్ అధికారి కె.ఎస్. శ్రీనివాసరాజును ముఖ్యమంత్రి కార్యాలయ ముఖ్య కార్యదర్శిగా ప్రభుత్వం నియమించింది. ఆయ‌న ఈ పదవిలో రెండేళ్లపాటు కొనసాగనున్నారు. శ్రీనివాసరాజు ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందినవారు. గతంలో టీటీడీ జేఈవోగా విశిష్ట సేవలు అందించారు.

ఇటీవల పదవీ విరమణ చేసిన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారికి ఎంసీఆర్‌ హెచ్‌ఆర్‌డీ వైస్ చైర్‌పర్సన్ పదవిని అప్పగించింది. అదనంగా, **ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీ డైరెక్టర్ జనరల్ (డీజీ) గా కూడా ఆమె బాధ్యతలు చేపట్టనున్నారు. కాగా, కొత్త సీఎస్‌గా కె. రామకృష్ణారావు బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే.

అలాగే, బుధవారం పదవీ విరమణ పొందిన సీనియర్ ఐపీఎస్ అధికారి వి.బి. కమలాసన్ రెడ్డిను తిరిగి నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయనను రాష్ట్ర నిఘా భద్రత విభాగం ఓఎస్‌డీగా నియమించారు. అదే సమయంలో ఇంటిగ్రేటెడ్ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ డైరెక్టర్ బాధ్యతలు కూడా అప్పగించారు. గతంలో ఆయ‌న ఔషధ నియంత్రణ విభాగం డీజీగా, ఆబ్కారీ శాఖ సంచాలకుడిగా పనిచేశారు.

కమలాసన్ రెడ్డి స్థానంలో, ఐపీఎస్ అధికారి షానవాజ్ ఖాసీంను సీఎం కార్యాలయ కార్యదర్శిగా ప్రభుత్వం నియమించింది. ఇక ఇటీవల సీజీజీ డీజీగా నియమితులైన సీనియర్ ఐఏఎస్ అధికారి శశాంక్ గోయల్ను ఢిల్లీ తెలంగాణ భవన్ ప్రత్యేక సీఎస్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

 

Exit mobile version