Site icon NTV Telugu

Land Registrations: కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ రిజిస్ట్రేషన్ల శాఖ.. పని వేళలు పొడిగింపు..

Land Registrationsssss

Land Registrationsssss

తెలంగాణ రాష్ట్ర రిజిస్ట్రేషన్లు, స్టాంపుల శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26) మార్చి 31తో ముగియనున్న నేపథ్యంలో.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ల రద్దీ విపరీతంగా పెరిగింది. ఈ రద్దీని దృష్టిలో ఉంచుకుని, సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు రిజిస్ట్రేషన్ల పని వేళలను ప్రభుత్వం భారీగా పొడిగించింది.

కమిషనర్ అండ్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ జారీ చేసిన తాజా ఉత్తర్వుల ప్రకారం.. ఈ నెల 28, 30 , 31 తేదీలలో అన్ని కార్యాలయాలు ఉదయం 9:30 గంటల నుంచి రాత్రి 8:30 గంటల వరకు నిరంతరాయంగా పనిచేస్తాయి. సాధారణంగా సాయంత్రం 5:00 గంటలకే ముగిసే పని వేళలను.. ఇప్పుడు రాత్రి వరకు పొడిగించడం వల్ల పెండింగ్‌లో ఉన్న డాక్యుమెంట్ల ప్రక్రియ వేగవంతం కానుంది.

Also Read:New Gas Connections: ఏపీ ప్రజలకు భారీ శుభవార్త.. 10 లక్షల కొత్త గ్యాస్ కనెక్షన్లు..

స్లాట్ల సంఖ్య పెంపు..

ఆర్థిక సంవత్సరం చివరిలో ఆస్తుల కొనుగోలు, అమ్మకాలు ఎక్కువగా జరుగుతుంటాయి. దీనివల్ల స్లాట్లు దొరకక చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. దీనిని పరిష్కరించడానికి ప్రభుత్వం స్లాట్ల సంఖ్యను కూడా పెంచింది. ప్రజలు తమకు వీలైన సమయంలో స్లాట్ బుక్ చేసుకుని, రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు.

సిబ్బందికి కఠిన ఆదేశాలు..

ఈ మూడు రోజుల పాటు (మార్చి 28, 30, 31) సబ్ రిజిస్ట్రార్లు, కార్యాలయ సిబ్బంది ఎవరూ సెలవులు తీసుకోకూడదని ఉన్నతాధికారులు ఆదేశించారు. పెరిగిన పని వేళలకు అనుగుణంగా సిబ్బంది అందుబాటులో ఉండి, ప్రజలకు సేవలు అందించాలని స్పష్టం చేశారు. జిల్లా రిజిస్ట్రార్లు, డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్స్ ఈ మార్పుల గురించి స్థానిక ప్రజలకు తెలిసేలా విస్తృత ప్రచారం కల్పించాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. ఈ నిర్ణయం వల్ల ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు, సామాన్య ఇల్లు లేదా భూమి కొనుగోలుదారులకు ఎంతో ఊరట లభించనుంది. మార్చి 31లోపు రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలనుకునే వారు ఈ పొడిగించిన సమయాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.

Exit mobile version