తెలంగాణలో పోలీసు ఉద్యోగాల భర్తీకి సంబంధించి బోర్డు తాజాగా కొన్ని కీలక వివరాలను వెల్లడించింది. రాష్ట్రంలో మొత్తం 7,437 ఖాళీల భర్తీ కోసం జూలై 29న నోటిఫికేషన్లు రాగా, ఆగస్టు 19 నుంచి సెప్టెంబర్ 16 వరకు ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ విజయవంతంగా ముగిసింది. ఈ సారి ప్రభుత్వం వయస్సు సడలింపు ఇవ్వడంతో దాదాపు 1.13 లక్షల మంది అభ్యర్థులకు లబ్ధి చేకూరింది. మొత్తం 4,29,000 మంది అభ్యర్థులు 5,77,064 దరఖాస్తులను సమర్పించారు. ఇందులో అత్యధికంగా 68 శాతానికి పైగా అభ్యర్థులు కేవలం ఒక్క పోస్టుకే దరఖాస్తు చేసుకున్నారు.
దరఖాస్తు చేసిన వారిలో పురుషులు 74 శాతానికి పైగా ఉండగా, మహిళా అభ్యర్థులు 25 శాతానికి పైగా ఉన్నారు. ఇక కేటగిరీల వారీగా చూస్తే బీసీ అభ్యర్థులు దాదాపు 49 శాతం, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 43 శాతానికి పైగా దరఖాస్తులు చేసుకున్నారు. మొదటిసారిగా ప్రవేశపెట్టిన ఆధార్ ఫేస్ అథెంటికేషన్‌ను 97 శాతానికి పైగా అభ్యర్థులు విజయవంతంగా పూర్తి చేశారు. పూర్తి చేయని వారు సెప్టెంబర్ 30 లోపు తమ లాగిన్ ద్వారా దీన్ని పూర్తి చేసి పీడీఎఫ్ ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని బోర్డు తెలిపింది.
పరీక్షా మాధ్యమం విషయానికి వస్తే.. చాలా మంది అభ్యర్థులు తెలుగును ఎంచుకోగా, కొద్దిమంది ఇంగ్లీష్, ఉర్దూ భాషలను ఎంచుకున్నారు. ఇక తాజా రాత పరీక్ష తేదీలను కూడా బోర్డు ఖరారు చేసింది. ఎస్ఐ , తత్సమాన పోస్టులకు సంబంధించిన ప్రిలిమినరీ రాత పరీక్షను నవంబర్ 29న.. అలాగే పీసీ , తత్సమాన పోస్టుల రాత పరీక్షను డిసెంబర్ 20న నిర్వహించనున్నట్లు బోర్డు స్పష్టం చేసింది. ఉమ్మడి జిల్లాల కేంద్రాల్లో ఈ పరీక్షలు జరగనున్నాయి. అభ్యర్థులు ఈ తేదీలను దృష్టిలో ఉంచుకుని తమ ప్రిపరేషన్‌ను వేగవంతం చేయాలని సూచించారు.

