తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ సేవలకు వెన్నెముకగా నిలిచే మీ-సేవా (MeSeva) కేంద్రాలు తాత్కాలికంగా మూతపడనున్నాయి. వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు, సాంకేతిక హంగులను అద్ది వినియోగదారులకు మెరుగైన సేవలందించే ఉద్దేశంతో ఐటీ శాఖ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. దాదాపు 36 గంటల పాటు సర్వర్లు అందుబాటులో ఉండవని అధికారులు స్పష్టం చేశారు.
మీ-సేవా పోర్టల్‌లో కొత్త సాఫ్ట్‌వేర్ వెర్షన్‌ను అప్‌లోడ్ చేయడం , డేటా సెంటర్ల వార్షిక నిర్వహణ పనుల కారణంగా ఈ అంతరాయం ఏర్పడనుంది. శుక్రవారం రాత్రి నుంచే ఈ ప్రక్రియ ప్రారంభమైంది. దీనివల్ల రాష్ట్రంలోని అన్ని మీ-సేవా కేంద్రాలతో పాటు, ఆన్‌లైన్ ద్వారా చేసుకునే దరఖాస్తులు కూడా నిలిచిపోతాయి. ఆదివారం ఉదయం 8 గంటల తర్వాత మీ-సేవా వెబ్‌సైట్ తిరిగి యాక్టివ్ అవుతుంది.
Also Read:Russia offers: భారత్‌కు అండగా రష్యా.. ఇక గ్యాస్, ముడి చమురు కష్టాలు తీరినట్లే..
సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ తర్వాత సోమవారం ఉదయం నుంచి ప్రజలు యథావిధిగా అన్ని రకాల సేవలను పొందవచ్చు. ఈ 36 గంటల విరామ సమయంలో కుల, ఆదాయ ధృవీకరణ పత్రాలు, భూమి రికార్డులు (పహాణీలు), విద్యుత్ బిల్లుల చెల్లింపులు .. ఇతర ప్రభుత్వ దరఖాస్తులు సాధ్యపడవు. ముఖ్యంగా వివిధ పోటీ పరీక్షలు లేదా సంక్షేమ పథకాలకు గడువు ముగియనున్న అభ్యర్థులు ఈ విషయాన్ని గమనించి ముందస్తుగా ప్లాన్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
సర్వర్ల సామర్థ్యాన్ని పెంచడం వల్ల భవిష్యత్తులో వెబ్‌సైట్ హ్యాంగ్ అవ్వడం లేదా లావాదేవీలు విఫలం కావడం వంటి సమస్యలు తగ్గుతాయని ఐటీ నిపుణులు పేర్కొంటున్నారు. అత్యవసర పనులు ఉన్నవారు సోమవారం ఉదయం వరకు వేచి చూడాల్సిందే.
