Housing Scheme: సొంతిళ్లు లేని వారికి శుభవార్త.. రేపటి నుంచే దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం..

Indiramma Housing App

Indiramma Housing App

హైదరాబాద్ ప్రాంతంలోని క్యూర్ (CURE) పరిధిలో పేద ప్రజల సొంతింటి కల నెరవేర్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. వచ్చే ఏడాది లబ్ధిదారులు ఈ కొత్త ఇళ్ల నుంచే బోనాలు ఎత్తేలా పనులను శరవేగంగా పూర్తి చేస్తామని రెవెన్యూ, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. సచివాలయంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, మహ్మద్ అజారుద్దీన్‌లతో కలిసి ఆయన ఈ పథకం బ్రోచర్‌ను ఆవిష్కరించారు.

ఈ పథకం కింద తొలి విడతగా 16 నియోజకవర్గాల్లో ప్రయోగాత్మకంగా నియోజకవర్గానికి 500 ఇళ్ల చొప్పున మొత్తం 8,000 ఇళ్లను నిర్మించనున్నారు. త్వరలోనే మరో 8 నియోజకవర్గాల్లో కూడా స్థలాలను గుర్తించి ఈ పథకాన్ని విస్తరిస్తారు. అర్హులైన వారు జూలై 21 నుండి ఆగస్టు 10 వరకు మీసేవ, అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు రుసుము రూ.10 వేలుగా నిర్ణయించారు. ఏ నియోజకవర్గ ప్రజలు ఆ నియోజకవర్గంలోనే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఇందులో 525 చదరపు అడుగుల వైశాల్యంతో 1BHK (బెడ్‌రూమ్, హాల్, కిచెన్) ఫ్లాట్లను పేదల నివాస ప్రాంతాల్లోనే నిర్మిస్తారు. ఒక్కో ఇంటి నిర్మాణ వ్యయం రూ.11 లక్షలు కాగా, అందులో రూ.5 లక్షలను ప్రభుత్వం సబ్సిడీ రూపంలో ఉచితంగా ఇస్తుంది. మిగిలిన లబ్ధిదారుని వాటా రూ.6 లక్షలను నాలుగు వాయిదాల్లో చెల్లించే సౌకర్యం కల్పించారు. దీనితో పాటు రూ.40-60 లక్షల విలువైన స్థలాన్ని లబ్ధిదారులైన ఆడపడుచుల పేరిట ప్రభుత్వం ఉచితంగా రిజిస్ట్రేషన్ చేస్తుంది. ఈ ఆస్తిని 10 ఏళ్ల వరకు అమ్ముకోవడానికి వీల్లేదు, కానీ బ్యాంకు రుణం కోసం తాకట్టు పెట్టుకోవచ్చు.

ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే కుటుంబ వార్షిక ఆదాయం రూ.6 లక్షల లోపు ఉండాలి. అలాగే క్యూర్ పరిధిలో వారికి ఎలాంటి సొంత ఇల్లు లేదా స్థలం ఉండకూడదు. ఒక కుటుంబం నుండి ఒకే దరఖాస్తును స్వీకరిస్తారు. ఇళ్ల కేటాయింపులో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ప్రత్యేక రిజర్వేషన్లు ఉంటాయి. ఒకవేళ అర్హుల సంఖ్య ఎక్కువగా ఉంటే బహిరంగ లాటరీ ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. ఇల్లు మంజూరు కాని వారికి దరఖాస్తు రుసుము రూ.10,000 తిరిగి చెల్లిస్తారు. పేదలతో పాటు త్వరలోనే మధ్యతరగతి ప్రజలకు కూడా ఇళ్ల విషయంలో శుభవార్త చెప్తామని మంత్రి ఈ సందర్భంగా ప్రకటించారు.