Site icon NTV Telugu

TS High Court: గ్రూప్-1 పరీక్షను వాయిదా వేయడం కుదరదు..

High Court

High Court

TS High Court: గ్రూపు-1 ప్రిలిమ్స్‌ పరీక్షను వాయిదా వేయడానికి తెలంగాణ హైకోర్ట్ మంగళవారం నిరాకరించింది. ఈ నెల 9వ తేదీన జరిగే ఈ పరీక్షకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తైనందున ఈ దశలో వాయిదా వేయాలనే నిర్ణయం తీసుకోలేమని చెప్పుకొచ్చింది. జూన్‌ 9న కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని అసిస్టెంట్‌ సెంట్రల్‌ ఇంటెలిజెన్స్‌ ఆఫీసర్‌ గ్రేడ్‌-1, ఎగ్జిక్యూటివ్‌ పోస్టులకు స్క్రీనింగ్‌ పరీంక్ష ఉండటంతో గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ను మరో తేదీకి మార్చాలని ఎం.గణేశ్, భూక్యా భరత్‌లు హైకోర్టులో పిల్ దాఖలు చేశారు.

Read Also: MODI: ప్రధాని మోడీకి ప్రపంచ దేశాల అధినేతల అభినందనల వెల్లువ..

అయితే, ఈ పిటిషన్ పై జస్టిస్‌ పుల్లా కార్తీక్‌ విచారణ చేయగా.. టీజీపీఎస్సీ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు.. రాష్ట్రంలో రెండు ఇంటెలిజెన్స్‌ పోస్టులకు 700 మంది అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు.. కానీ, గ్రూప్‌-1 పరీక్షకు 4 లక్షల మందికి పైగా ఆశావహులు పోటీ పడుతున్నారని వెల్లడించారు. కొంత మంది కోసం లక్షల మంది భవిష్యత్తును పణంగా పెట్టడం సరి కాదని టీజీపీఎస్సీ లాయర్ వాదించారు. ఈ వాదనతో ఏకీభవించిన న్యాయమూర్తి కార్తీక్ ప్రిలిమ్స్‌ పరీక్ష వాయిదా వేసేందుకు నిరాకరించారు. ఈ నెల 1వ తేదీన పిటిషనర్లు ఇచ్చిన వినతిపత్రాన్ని పరిశీలించి టీజీపీఎస్సీ తుది నిర్ణయం తీసుకోవాలని ఆదేశిస్తూ పిటిషన్‌పై విచారణను క్లోజ్ చేసింది.

Exit mobile version