Telangana Heatwave: షాకింగ్.. తెలంగాణలో వడ దెబ్బతో 34 మంది మృతి.. ఈ 18 జిల్లాల ప్రజలు జాగ్రత్త!

Heatwave Red Alert

Heatwave Red Alert

Telangana Heatwave: తెలంగాణలో భానుడి భగభగలు తీవ్రరూపం దాల్చాయి. రాష్ట్రవ్యాప్తంగా ఎండల తీవ్రత రోజురోజుకు పెరుగుతుండగా, 18కు పైగా జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 46 డిగ్రీల సెల్సియస్‌ను దాటాయి. పరిస్థితి తీవ్రంగా మారడంతో అధికారులు 18 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. హైదరాబాద్‌లోనూ ఉష్ణోగ్రతలు భారీగా పెరిగి 43 డిగ్రీలకుపైగా నమోదయ్యాయి. రాష్ట్రంలోని ఉత్తర, తూర్పు జిల్లాలు తీవ్ర వడగాలుల ప్రభావానికి గురవుతున్నాయి. వడదెబ్బ ప్రభావం ఆందోళనకరంగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా వడదెబ్బ కారణంగా 34 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో ప్రజలు అత్యవసరం అయితే తప్ప మధ్యాహ్న సమయంలో బయటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.

అసలు వడదెబ్బ అంటే ఏంటి?
హీట్‌ స్ట్రోక్‌ అంటే.. డీహైడ్రేషన్‌కు సంబంధించిన అనారోగ్యం. ఇందులో హీట్ ఎగ్జాషన్, హీట్ ఇంజురీ, హీట్‌ స్ట్రోక్‌ అనే మూడు రకాలు ఉంటాయి. హీట్ ఎగ్జాషన్‌లో అధిక ఉష్ణోగ్రతల కారణంగా అలసటగా ఉంటుంది, గాలిలో తేమ ఎక్కువగా ఉండటం, వేడిగా ఉన్నప్పుడు ఎక్కువగా అలసిపోయినట్లు అనిపిస్తుంది. కండరాల నొప్పి ఉంటుంది. హీట్ ఇంజురీలో శరీర భాగాలు దెబ్బతినే అవకాశం ఉంది. కిడ్నీ, గుండె సమస్యలు వచ్చే అవకాశం ఉంది. హీట్‌ స్ట్రోక్‌ తీవ్రమైన సమస్య.. దీనిలో శరీర భాగాలు తీవ్రంగా దెబ్బతింటాయి. దీని కారణంగా మెదడు పనితీరు దెబ్బతింటుంది. స్ట్రోక్‌ సంభవించవచ్చు. దీన్ని నిర్లక్ష్యం చేస్తే.. కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉంది.

×
×
Ad

ఈ వడదెబ్బ నుంచి తప్పించుకోవాలంటే.. శరీరాన్ని ఎప్పుడూ హైడ్రేట్‌గా ఉంచుకోవాలి. ద్రవపదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. మధ్యాహ్నం పూట బయటకు వెళ్లకపోవడం మంచిది. షుగర్, బీపీ పేషెంట్లు మెడికేషన్‌ సక్రమంగా తీసుకోవాలి. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 వరకు బయట తిరగకపోవడమే మంచిది. అత్యవసర పరిస్థితిలో వెళ్లాల్సి వస్తే.. తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముదురు రంగు దుస్తులు కాకుండా తేలికపాటి లేత రంగు దుస్తులను ధరించాలి. ఆల్కాహాల్‌ శరీరంలోని నీటి శాతాన్ని తగ్గిస్తాయి. ఎండాకాలంలో మద్యానికి దూరంగా ఉండటం మంచిది. ఓఆర్‌ఎస్‌, కొబ్బరి నీళ్లు, ఉప్పు కలిపిన నిమ్మరసం లాంటివి శరీరం కోల్పోయిన లవణాలను తిరిగి భర్తీ చేస్తాయి. దోసకాయలు, పుచ్చకాయలు, దానిమ్మ, బత్తాయి లాంటి పండ్లు తీసుకోవాలి. వేసవిలో తేలికపాటి వ్యాయామాలు ఉదయం 8 గంటల్లోపే ముగించాలి. వడదెబ్బ లక్షణాలు కనిపించగానే చికిత్స అందించాలి. లేదంటే శరీరం పూర్తిగా నిర్జలీకరణం చెంది.. బీపీ, పల్స్‌ పడిపోయి కొన్నిసార్లు ప్రాణాలు పోవచ్చు.