NTV Telugu Site icon

Heat Wave: తెలంగాణలో భగ్గుమంటున్న ఎండలు.. ప్రజలకు వైద్య ఆరోగ్య శాఖ సూచనలివే!

Telangana

Telangana

Heat Wave: తెలంగాణ‌లో ఎండ‌లు భగ్గుమంటున్నాయి. భానుడి భ‌గ‌భ‌గ‌ల‌కు జనాలు విల‌విల‌లాడిపోతున్నారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో ఉక్కపోత‌తో ప్రజ‌లు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు. రాబోయే రెండు రోజుల్లో కూడా ప‌గ‌టి ఉష్ణోగ్రత‌లు మ‌రింత పెరిగే అవ‌కాశం ఉంద‌ని హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ కేంద్రం తెలిపింది. రాబోయే రోజుల్లో గ‌రిష్ఠంగా 2 నుంచి 3 డిగ్రీల వ‌ర‌కు ఉష్ణోగ్రత‌లు పెరిగే అవ‌కాశం ఉంద‌న్నారు. ఈ ఉష్ణోగ్రతల నుంచి రక్షించుకోవడానికి ప్రజల కోసం వేడి గాలులపై ఆరోగ్య శాఖ డైరెక్టర్ ఆఫ్ హెల్త్ నోట్ విడుదల చేసింది. 43 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరిగిన క్రమంలో ఏం చేయాలో.. ఏం చేయకూడదో సలహా ఇచ్చింది.

Read Also: Dubai Floods: ఇంకా నీళ్లల్లోనే దుబాయ్.. స్తంభించిన జనజీవనం

ఈ జాగ్రత్తలు పాటించండి..
*హైడ్రేటెడ్ గా ఉండండి: మీకు దాహం వేయకపోయినా, వీలైనంత వరకు తగినంత నీరు త్రాగండి. ఫ్లూయిడ్స్, కొబ్బరి నీళ్లు, మజ్జిగ ఎక్కువ తీసుకోండి. రీహైడ్రేషన్ సొల్యూషన్ (ORS), నిమ్మకాయ నీరు, మజ్జిగ వంటి ఇంట్లో తయారుచేసిన పానీయాలను తీసుకోండి. పాలు, లస్సీ, పండ్ల రసాలు మొదలైనవి తీసుకోండి. ప్రయాణ సమయంలో నీటిని మీతో పాటు తీసుకెళ్లండి.

*పుచ్చకాయ వంటి అధిక నీటి కంటెంట్ ఉన్న సీజనల్ పండ్లు. కూరగాయలను తినండి. నారింజ, ద్రాక్ష, పైనాపిల్, దోసకాయ, పాలకూర లేదా ఇతర స్థానికంగా లభించే పండ్లు, కూరగాయలు స్వీకరించండి.

*పలచగా.. వదులుగా ఉండే కాటన్ వస్త్రాలను ధరించడం మంచిది. ఎండలో తిరిగేటప్పుడు నల్లటి దుస్తులు వేసుకోవద్దు. తెల్లటి దుస్తులు వేసుకుంటే ఎండ ప్రభావం తక్కువగా ఉంటుంది.

*మీరు బయటకు వెళ్లే సమయంలో గొడుగు, టోపీ, టోపీ, టవల్ లాంటివి తలపై కప్పుకొని వెళ్లడం మంచిది.

*ఎండలో బయటకు వెళ్లేటప్పుడు బూట్లు లేదా చెప్పులు ధరించండి.

*రాష్ట్రంలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్న కారణంగా మధ్యాహ్న సమయంలో రోడ్లపై తిరగొద్దు. అత్యవసరమైతేనే ఇంటి నుంచి బయటకు రావాలి. లేదంటే ఇంట్లోనే ఉండి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి.

*ఆల్కహాల్, టీ, కాఫీ, కార్బోనేటేడ్ శీతల పానీయాలు లేదా పెద్ద మొత్తంలో చక్కెరతో కూడిన పానీయాలను నివారించండి.

*ట్రాఫిక్ పోలీసులు, గ్రామీణ ఉపాధి హామీ పనులు చేసేవాళ్ళు, జర్నలిస్టులు, బయట ఎక్కువగా తిరిగే వాళ్ళు జాగ్రత్తలు పాటించాలి.

* ఈ కాలంలో ఫుడ్, వాటర్ ఎక్కువగా కలుషితమయ్యే అవకాశం ఉన్నందున జాగ్రత్తలు తీసుకోవాలి.

వడదెబ్బ లక్షణాలు: చెమట పట్టకపోవడం, గొంతు ఎండిపోవడం, అత్యంత నీరసం, తలనొప్పి, గుండెదడ, మూత్రం రాకపోవడం. వడదెబ్బ తగిలిన వారిని వెంటనే ఆసుపత్రిలో చేర్పించాలి.

ప్రభుత్వ ఏర్పాట్లు
ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది. ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు అంగన్ వాడీ కేంద్రాల్లో, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో విరివిగా అందుబాటులో ఉంటాయి. చలివేంద్రాలు, మజ్జిగ కేంద్రాలు ఎక్కువ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సూచించింది.