NTV Telugu Site icon

Sports University: తెలంగాణలో స్పోర్ట్స్‌ యూనివర్సిటీ.. ఒలింపిక్స్‌ స్థాయి ప్రమాణాలతో అకాడమీలు!

Cm Revanth Reddy

Cm Revanth Reddy

CM Revanth Reddy Announces Young India Sports University: హైదరాబాద్‌లో యంగ్‌ ఇండియా స్పోర్ట్స్‌ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అంతర్జాతీయ ప్రమాణాలతో ఫ్యూచర్‌ సిటీ (ఫోర్త్‌ సిటీ)లో నిర్మించే స్పోర్ట్స్‌ హబ్‌లో దీన్ని ఏర్పాటు చేయనున్నారు. దాదాపు 12 క్రీడల అకాడమీలను ఇందులో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. వీటిలో అంతర్జాతీయ స్థాయి అధునాతన మౌలిక సదుపాయాలు ఉంటాయి. ఈ స్పోర్ట్స్‌ హబ్‌లో స్పోర్ట్స్‌ సైన్స్‌ సెంటర్‌, స్పోర్ట్స్‌ మెడిసిన్‌ సెంటర్‌ కూడా అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేస్తారు.

కొత్తగా స్థాపించిన సిల్‌ యూనివర్సిటీ తరహాలోనే తెలంగాణ స్పోర్ట్స్‌ వర్సిటీకి ‘యంగ్‌ ఇండియా స్పోర్ట్స్‌ యూనివర్సిటీ’ అనే పేరు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ స్పోర్ట్స్‌ హబ్‌ కోసం అనువైన స్థలంగా ప్రస్తుతం హకీంపేటలో ఉన్న స్పోర్ట్స్‌ స్కూల్ లేదా గచ్చిబౌలిలోని స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లను అధికారులు పరిశీలిస్తున్నారు. సదరు క్యాంపస్‌ను ఒలింపిక్స్‌ స్థాయి అంతర్జాతీయ ప్రమాణాలు ఉండేలా అప్‌గ్రేడ్‌ చేయాలని నిర్ణయించారు.

Also Read: Tirumala Darshan Tickets: శ్రీవారి భక్తులకు అలర్ట్.. రేపు ఆర్జిత సేవా టికెట్లు విడుదల!

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఇటీవల దక్షిణ కొరియా పర్యటనలో సియోల్‌లోని కొరియన్‌ నేషనల్‌ స్పోర్ట్స్‌ యూనివర్సిటీని సందర్శించారు. ఇది ప్రపంచంలోనే పేరొందిన స్పోర్ట్స్‌ యూనివర్సిటీగా ప్రత్యేకత చాటుకుంది. ఇటీవల ముగిసిన పారిస్ ఒలింపిక్స్‌లో దక్షిణ కొరియా మొత్తం 32 పతకాలు గెలుచుకోగా.. అందులో 16 పతకాలు కొరియన్ నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీలో శిక్షణ పొందిన అథ్లెట్లు సాధించినవే కావడం గమనార్హం. ఈ యూనివర్సిటీలో శిక్షణ పొంది పారిస్ ఒలింపిక్స్‌లో ఆర్చరీ విభాగంలో మూడు బంగారు పతకాలు సాధించిన అథ్లెట్ లిమ్ సి-హైయోన్‌ను సీఎం రేవంత్ రెడ్డి కలిసి అభినందించారు. భవిష్యత్తులో ఒలింపిక్‌ చాంపియన్లకు శిక్షణ ఇచ్చేలా తెలంగాణ యంగ్‌ ఇండియా స్పోర్ట్స్‌ యూనివర్సిటీకి సాంకేతిక భాగస్వాములుగా కొరియన్‌ నేషనల్‌ స్పోర్ట్స్‌ యూనివర్సిటీ సేవలను వాడుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.