తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసి, పంటలు సమృద్ధిగా పండాలని ఆకాంక్షిస్తూ ప్రభుత్వం తరఫున మహా వరుణ యాగం నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఎల్‌నినో వంటి వాతావరణ ప్రతికూల ప్రభావాలు తగ్గి, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలనే బృహత్తర సంకల్పంతో నాగార్జునసాగర్ వేదికగా ఈ పవిత్ర వైదిక క్రతువుకు శ్రీకారం చుట్టారు.
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థాన ప్రధాన అర్చకులు, వేద పండితులు, దేవస్థాన సిద్ధాంతి శాస్త్రోక్తంగా చర్చించి ఆగస్టు 10వ తేదీని శుభ ముహూర్తంగా నిర్ణయించారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని నాగార్జునసాగర్ డ్యామ్ తీరాన ఉన్న విజయవిహార్ ప్రాంగణంలో ఈ యాగం వైభవంగా జరగనుంది. రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో యాదగిరిగుట్ట క్షేత్ర పండితులు, అర్చకులు వేద మంత్రోచ్ఛారణలతో యాగాన్ని నిర్వహించనున్నారు. ఈ పవిత్ర వైదిక క్రతువు కోసం ప్రాంగణంలో ప్రత్యేకంగా 11 హోమకుండాలను సిద్ధం చేస్తున్నారు.
సుమారు 108 మంది ఋత్వికులు, వేద పండితులు ఈ యాగంలో పాల్గొని ప్రత్యేక పూజలు సమర్పిస్తారు. కృష్ణా, గోదావరి నదుల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరాలని, డ్యామ్‌లు, జలాశయాలు, చెరువులు, కుంటలు జలకళ సంతరించుకోవాలని సంకల్పిస్తున్నారు. ఆకలి తీర్చే అన్నదాతల పాడిపంటలు సమృద్ధిగా పండి రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఈ సందర్భంగా ప్రత్యేక వేద ప్రార్థనలు చేపడతారు.
రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి పూర్తి సారథ్యంలో ఈ మహా వరుణ యాగానికి సంబంధించిన ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఆగస్టు 10వ తేదీన రోజంతా జరిగే ఈ యాగ క్రతువు మధ్యాహ్నం 3:24 గంటలకు జరిగే మహత్తర పూర్ణాహుతితో ముగుస్తుంది. ఈ పవిత్ర సంపూర్ణాహుతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్వయంగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.

