Governor Shiv Pratap Shukla: తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు నేడు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధికి దిశానిర్దేశం చేస్తూ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. అంతకుముందు అసెంబ్లీకి చేరుకున్న గవర్నర్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మరియు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఘన స్వాగతం పలికారు.
Moinabad: ఫామ్‌హౌస్ డ్రగ్స్ పార్టీ కేసు.. రిమాండ్ రిపోర్టులో సంచలన వివరాలు.!
నేటి సమావేశాల ప్రారంభానికి ముందు ఒక చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. అసెంబ్లీ ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేసిన ‘తెలంగాణ తల్లి’ విగ్రహాన్ని గవర్నర్ ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించి సభలోకి ప్రవేశించారు. గవర్నర్ తన ప్రసంగాన్ని తెలుగులో ప్రారంభించి పలు విషయాలను ప్రసంగించారు. ఇందులో 3 ట్రిలియన్ డాలర్ల లక్ష్యం తెలంగాణ ఆర్థిక వ్యవస్థ బలోపేతంగా ఉందని గవర్నర్ పేర్కొన్నారు. దేశ జీడీపీలో రాష్ట్రం 4.99% వాటాను కలిగి ఉందని, తలసరి ఆదాయం రూ. 4.18 లక్షలకు చేరడం శుభపరిణామమని కొనియాడారు. రాబోయే కాలంలో తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చేందుకు రోడ్ మ్యాప్ సిద్ధం చేసినట్లు ప్రకటించారు. ఇంకా హైదరాబాద్ ను ప్రపంచ పెట్టుబడుల గమ్యస్థానంగా మారుస్తూ, ఐటీ ఎగుమతులు రూ. 3.13 లక్షల కోట్లకు చేరాయని వెల్లడించారు.
రాష్ట్రాభివృద్ధి కోసం ప్రభుత్వం మూడు ప్రత్యేక నమూనాలను అనుసరిస్తోందని గవర్నర్ వివరించారు. ఇందులో మొదటగా పట్టణాభివృద్ధి కోసం ‘క్యూరో (Cure)’ నమూనాను వాడుతున్నారు. జీహెచ్ఎంసీని 3 కార్పొరేషన్లుగా, హైదరాబాద్ మెట్రో పాలిటన్ ప్రాంతాన్ని 4 కమిషనరేట్లుగా విభజించారు. ఇక రెండో అంశం ప్యూర్ (Pure) లో భాగంగా పర్యావరణ పరిరక్షణలో భాగంగా మూసీ ప్రక్షాళన కోసం 45 ఎస్టీపీలను ఏర్పాటు చేస్తున్నారు. అలాగే మూడోది రేర్ (Rare) ద్వారా వ్యవసాయ రంగం, గ్రామీణాభివృద్ధి కోసం ఈ నమూనాను రూపొందించారు.
ప్రజాకేంద్రీకృత పాలనే తమ లక్ష్యమని చెబుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను గవర్నర్ వివరించారు. ఇందులో రైతు భరోసా కింద రూ. 8,744 కోట్లు, రుణమాఫీ కోసం రూ. 20,616 కోట్లు ఖర్చు చేశారు. 15.12 లక్షల కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తూ, 3.38 కోట్ల మందికి సన్నబియ్యం అందిస్తున్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ద్వారా ఇప్పటివరకు 269 కోట్ల ట్రిప్పులు నమోదు అయ్యాయి అని అన్నారు. ఇంకా నిరుపేదల కోసం 4.5 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.
ఇంకా రాష్ట్ర భవిష్యత్తును మార్చే దిశగా భారీ ప్రాజెక్టులను గవర్నర్ ప్రకటించారు. ఇందులో ఫ్యూచర్ సిటీ నుండి బందర్ పోర్టు వరకు గ్రీన్ ఎక్స్‌ప్రెస్ వే నిర్మిస్తామని, శంషాబాద్ బుల్లెట్ రైళ్లకు కేంద్రం కాబోతోందని తెలిపారు. ఆదిలాబాద్, వరంగల్ జిల్లాల్లో త్వరలోనే కొత్త విమానాశ్రయాలు అందుబాటులోకి రానున్నాయని ఆయన స్పష్టం చేశారు. చివరగా “శ్రమించే తత్వం గల తెలంగాణ ప్రజలు అభివృద్ధిలో భాగస్వాములు కావాలని.. ప్రతి వర్గానికి ఫలాలు అందించడమే మా ప్రభుత్వ ప్రాధాన్యత అని గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా పేర్కొన్నారు.