Site icon NTV Telugu

TG Govt: పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ కొరతపై ప్రభుత్వం కీలక ప్రకటన.. సందేహాలుంటే ఈ నంబర్‌కి కాల్ చేయండి..

Telangana

Telangana

TG Govt: తెలంగాణలో పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ కొరతపై ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా పెట్రోల్, డీజిల్ లేదా వంట గ్యాస్ (LPG) కొరత ఏమాత్రం లేదని తెలంగాణ ప్రభుత్వ పౌర సరఫరాల శాఖ స్పష్టం చేస్తోంది. ఆయిల్ రిఫైనరీల నుంచి స్థానిక డిపోల వరకు ఇంధన సరఫరా యంత్రాంగం పూర్తిగా, సక్రమంగా పనిచేస్తోంది. అన్ని జిల్లాల్లోని ప్రజల రోజువారీ అవసరాలను తీర్చడానికి సరిపడా ఇంధన నిల్వలు అందుబాటులో ఉన్నాయని స్పష్టం చేసింది. పౌర సరఫరాల శాఖ వివరాల ప్రకారం.. కొన్ని పెట్రోల్ బంకులలో పొడవైన క్యూలు, తాత్కాలికంగా “నో స్టాక్” (No Stock) బోర్డులు కనిపించడానికి ప్రధాన కారణం, తప్పుడు వదంతుల వల్ల ప్రజలు భయపడి అకస్మాత్తుగా ఇంధనం కొనుగోలు చేయడానికి ఎగబడటమే. డిపోలలో తగినంత ఇంధనం ఉన్నప్పటికీ, ప్రజలు అనవసరంగా తమ వాహనాల ట్యాంకులను పూర్తిగా నింపుకోవడానికి పరుగులు తీయడం వల్లే ఈ కృత్రిమ కొరత ఏర్పడుతోంది.

READ MORE: SUVs Under 10 Lakh: బడ్జెట్‌లో SUV కావాలా? రూ. 10 లక్షల లోపు టాటా నుండి టయోటా వరకు టాప్ 5 కాంపాక్ట్ SUVలు ఇవే

అంతేకాకుండా, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (OMC) ముందస్తు చెల్లింపు (advance-payment) విధానాల్లో చేసిన కొన్ని మార్పుల వల్ల స్థానిక డీలర్లకు చిన్నపాటి తాత్కాలిక సమస్యలు ఎదురయ్యాయి. ఇది కేవలం అంతర్గత పరిపాలన పరమైన విషయం మాత్రమే తప్ప, సరఫరాలో లోపం కాదు. పరిస్థితిని చక్కదిద్ది, అందరికీ సమానంగా ఇంధనం అందేలా చూడటానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, పెట్రోలియం సంస్థలు, పోలీసు శాఖతో కలిసి పెట్రోల్ బంకులను నిరంతరం పర్యవేక్షిస్తోంది. ఇంధనాన్ని అక్రమంగా నిల్వ చేసినా, బ్లాక్ మార్కెట్ చేసినా లేదా గృహ అవసరాలకు వాడే గ్యాస్ సిలిండర్లను వాణిజ్య (కమర్షియల్) అవసరాలకు అక్రమంగా మళ్లించినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం పేర్కొంది. ప్రజలందరూ ప్రశాంతంగా ఉండాలని, భయాందోళనలతో అనవసరంగా ఇంధనాన్ని కొనుగోలు చేయవద్దని ప్రభుత్వం కోరుతోంది. దయచేసి ప్రభుత్వ అధికారిక ప్రకటనలను మాత్రమే నమ్మండి. సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు వదంతులను నమ్మవద్దని, వాటిని ఇతరులకు పంపవద్దని (forward) కోరుతున్నామని ప్రభుత్వం పేర్కొంది. ఏవైనా సందేహాలు ఉన్నా లేదా అక్రమాలపై ఫిర్యాదు చేయాలన్నా, ప్రజలు పౌర సరఫరాల శాఖ టోల్ ఫ్రీ హెల్ప్లైన్ నంబర్‌ 1967 ను సంప్రదించగలరు.

Exit mobile version