NTV Telugu Site icon

CPI Narayana: ప్రతిపక్షంలో కూర్చున్నా.. కేసీఆర్‌కి జ్ఞానోదయం కలగలేదు!

Cpi Narayana

Cpi Narayana

CPI Narayana Slams KCR: ప్రతి క్షంలో కూర్చున్నా కూడా తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌కి జ్ఞానోదయం కలగలేదని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత ఆరు నెలలు కేబినెట్ ప్రకటించని సీఎం దేశంలో కేసీఆర్ తప్ప ఎవరు లేరని ఎద్దేవా చేశారు. అహంభావంతో కేసీఆర్ పరిపాలన చేశాశారని, అందుకే ఈ సారి ప్రజలు రేవంత్ రెడ్డికి పట్టం కట్టారన్నారు. గతంలో జరిగిన తప్పులను గుర్తించి.. తెలంగాణ అభివృద్ధి కోసం రేవంత్ రెడ్డి పని చేయాలని నారాయణ పేర్కొన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని గన్ పార్క్ వద్ద అమరవీరుల స్థూపానికి నారాయణ నివాళులర్పించారు.

గన్ పార్క్ వద్ద సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మాట్లాడుతూ… ‘తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. ఎంతో మంది విద్యార్థుల ప్రాణ త్యాగాల వల్లే తెలంగాణ వచ్చింది. ఒక్కరో ఇద్దరో కష్టపడితేనే తెలంగాణ రాష్ట్రం సాధ్యం కాలేదు. ఎంతో మంది అమరవీరుల త్యాగాలతో తెలంగాణ ఏర్పడింది. తెలంగాణ సాధనలో కేసీఆర్ పాత్ర కూడా ఉంది. ప్రజల మనోభావాలు ఉన్నా కూడా తెలంగాణ పేటేట్ రైట్స్ మొత్తం కేసీఆర్‌కే పోయింది. తెలంగాణ పేరుతో రాజకీయ పార్టీ పెట్టి పదేళ్లు కేసీఆర్ పాలించారు. సరైన పద్ధతిలో కేసీఆర్ పరిపాలన అందించలేకపోయారు. నీరు, విధులు, నియామకాలు అందించడంలో విఫలమయ్యారు. తెలంగాణను అభివృద్ధి చేస్తానన్న కేసీఆర్.. తన కుటుంబ సభ్యులను మాత్రం బాగానే అభివృద్ధి చేసుకున్నారు’ అని అన్నారు.

Also Read: T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్‌లో అమెరికా ఆల్‌టైమ్ రికార్డు.. టీమిండియాకు కూడా సాధ్యం కాలేదు!

‘కేసీఆర్ అవినీతికి కాళేశ్వరం పరాకాష్ట. ప్రతి పక్షంలో కూర్చున్నా కూడా కేసీఆర్‌కి జ్ఞానోదయం కలగలేదు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత ఆరు నెలలు కేబినెట్ ప్రకటించని సీఎం దేశంలో కేసీఆర్ తప్ప ఎవరు లేరు. ఆ ఆరు నెలలు ఫామ్ హౌస్‌లో పడుకుని కేబినెట్ ఏర్పాటు చేయలేదు. అహంభావంతో కేసీఆర్ పరిపాలన చేశారు. అందుకే ఈసారి ప్రజలు రేవంత్ రెడ్డికి పట్టం కట్టారు. రేవంత్ రెడ్డి ఉత్సాహవంతులు. కేంద్ర పార్టీ సపోర్ట్ కూడా ఆయనకు ఉంది. గతంలో జరిగిన తప్పులను గుర్తించి తెలంగాణ అభివృద్ధి కోసం రేవంత్ పని చేయాలి. అనవసరమైన గిల్లి కజ్జాలు పెట్టుకుంటే టైం వేస్ట్ తప్ప.. ఉపయోగం ఉండదని రేవంత్ గమనించాలి. అభివృద్ధిలో ఒక్కడివే కాకుండా అందరినీ కలుపుకుని పోవాలి. అందరినీ కలుపుకుని పోతేనే తెలంగాణ అభివృద్ధి చెందుతుంది. అందుకు కమ్యూనిస్టు పార్టీ కూడా సహకరిస్తుంది’ అని నారాయణ తెలిపారు.

Show comments