Telangana Food Safety: తెలంగాణలో ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్న ఆహార తయారీ యూనిట్లపై తెలంగాణ ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ (TG SAFE) కఠిన చర్యలు చేపట్టింది. ఈ క్రమంలోనే ఫుడ్ సేఫ్టీ అధికారులు, పోలీసులతో కూడిన 10 ప్రత్యేక ఎన్ఫోర్స్మెంట్ బృందాలు హైదరాబాద్, వరంగల్, ఉమ్మడి వరంగల్, రంగారెడ్డి జిల్లాల్లోని సుమారు 20 ఆహార తయారీ కేంద్రాల్లో ఏకకాలంలో ఆకస్మిక మెరుపు దాడులు నిర్వహించాయి. మసాలాలు, వంట నూనెలు, పాల ఉత్పత్తులు, స్వీట్లు, శీతల పానీయాలు, బేకరీ వస్తువులు తయారు చేసే ఈ యూనిట్లలో సోదాలు చేయగా తీవ్ర అపరిశుభ్రత, నిబంధనల ఉల్లంఘనలు వెలుగుచూశాయి.
అధికారుల తనిఖీల్లో రద్దీ తయారీ కేంద్రాల్లో తుప్పు పట్టి, మురికిగా ఉన్న యంత్రాలు, పాత్రలను ఉపయోగిస్తున్నట్లు స్పష్టమైంది. అంతేకాకుండా కాలం చెల్లిన సరైన లేబులింగ్ లేని సరుకులు నిల్వ ఉంచడం, బొద్దింకలు, ఈగలు, దోమలతో పాటు ఎలుకల మల విసర్జితాలు, పురుగులు, కీటకాలు సంచరిస్తున్న ప్రాంతాల్లోనే పదార్థాలను తయారు చేయడంపై అధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మురుగునీరు నిలిచిపోయిన నేలలు, బూజు పట్టిన గోడలు, సరైన వెలుతురు-గాలి లేని గదుల మధ్య ఈ ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. వీటితో పాటు ఉద్యోగుల ఆరోగ్య రికార్డులు, పెస్ట్ కంట్రోల్ నివేదికలు, నీటి నాణ్యత పరీక్ష పత్రాలు లేకపోవడాన్ని, అలాగే సిబ్బంది వ్యక్తిగత పరిశుభ్రత పాటించకుండా హెయిర్ నెట్స్, ఆప్రాన్లు, గ్లౌజులు ధరించకపోవడాన్ని తనిఖీ బృందాలు తీవ్రంగా పరిగణించాయి.
ఈ తీవ్రమైన లోపాల నేపథ్యంలో ఆహార భద్రతా నిబంధనలు ఉల్లంఘించిన 9 ప్రముఖ సంస్థల FSSAI లైసెన్సులను అధికారులు తక్షణమే సస్పెండ్ చేసి, వ్యాపారాలు, ఉత్పత్తిని వెంటనే నిలిపివేయాలని ఆదేశించారు. లైసెన్సులు రద్దయిన / సస్పెండ్ అయిన వాటిలో వరంగల్‌కు చెందిన హరిప్రియ ప్రొడక్ట్స్, దయానంద్ ఐస్‌క్రీమ్స్, రాజు ఘీ స్వీట్ హౌస్, శ్రీకృష్ణ ఆయిల్ మిల్స్, మట్టెవాడ రమేష్ ఇండస్ట్రీస్, జియాన్ ఫుడ్ ప్రొడక్ట్స్ (వెల్ మార్క్), గొర్రెకుంట కృపా బేకరీ ప్రొడక్ట్స్, హనుమకొండ కపిల్ ఫుడ్స్, షాద్‌నగర్ (చాతన్‌పల్లి) లోని శ్రీ SMP డెయిరీ ఉన్నాయి. అలాగే నిబంధనలకు విరుద్ధంగా ఉన్న సుమారు రూ.5,89,550 విలువైన 5,555 కిలోల ఆహార పదార్థాలను అధికారులు సీజ్ చేసి ధ్వంసం చేశారు. కల్తీ అనుమానంతో 21 నమూనాలను సేకరించి ల్యాబ్ పరీక్షల కోసం పంపించారు. జరిమానాలు విధించేందుకు గాను గంగా ఫుడ్ టెక్, GPR ఫుడ్స్, హెల్తీ హార్ట్ ఫుడ్స్, వర్షా స్పైసెస్, కరణి స్పైసెస్, మిఠాయివాలా, బెల్ బ్రాండ్, స్వాగత్ స్వీట్స్, మార్లూస్ ఫుడ్ & బెవరేజెస్ సహా మరో 9 సంస్థలకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. తీవ్ర లోపాలు ఉన్న లక్ష్మి ఫుడ్స్ (తిమ్మాపూర్), శివ తార ఫ్లోర్ మిల్ (వరంగల్) లకు లోపాలు సరిదిద్దుకోవాలని ‘ఇంప్రూవ్మెంట్ నోటీసులు’ ఇచ్చారు. వీటిపై తదుపరి చర్యలు ఉంటాయని అధికారులు స్పష్టం చేశారు.

