Telangana Floods: తెలంగాణలో కొనసాగుతున్న భారీ వర్షాల కారణంగా పలు జిల్లాల్లో వరద పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రాజెక్టులు పోటెత్తడంతో గేట్లు ఎత్తి నీటి విడుదల జరుగుతుండగా, విద్యాసంస్థలకు అధికారులు సెలవులు ప్రకటించారు. భారీ వర్షాల నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. అలాగే భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో సిద్దిపేట జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. సాత్నాల, మత్తడి వాగు ప్రాజెక్టుల గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కడెం ప్రాజెక్టు రెండు గేట్లు, స్వర్ణ ప్రాజెక్టు ఒక్క గేటు ఎత్తి నీరు వదులుతున్నారు. జైనథ్‌లో 116.5 మి.మీ., కొమురం భీం వాంకిడిలో 113 మి.మీ., మంచిర్యాల బెల్లంపల్లిలో 57 మి.మీ., నిర్మల్ కుంటాలలో 29.5 మి.మీ. వర్షపాతం నమోదైంది.
ఇక మహబూబ్ నగర్ జిల్లా విషయానికి వస్తే.. జూరాల ప్రాజెక్టుకు భారీ వరద పోటెత్తింది. అధికారులు 31 క్రెస్ట్ గేట్లు ఎత్తి 2.10 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో, 2.40 లక్షల క్యూసెక్కుల ఔట్‌ఫ్లోగా నీటిని విడుదల చేస్తున్నారు. మరోవైపు నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు 3.70 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రావడంతో 26 గేట్లు ఎత్తి 3.98 లక్షల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ప్రస్తుత నీటి మట్టం 585.20 అడుగులు, నిల్వ 298.13 టీఎంసీలు. మరోవైపు మూసీ ప్రాజెక్టులో 8 గేట్లను మూడు అడుగుల మేర ఎత్తి నీరు విడుదల చేస్తున్నారు.
Dowry Harassment: వరకట్న వేధింపులు తాళలేక యువతి ఆత్మహత్య..!
అలాగే కాళేశ్వరం ప్రాజెక్ట్‌లోని మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్‌లో భారీ వరద ఉధృతి కొనసాగుతోంది. మొత్తం 85 గేట్లు ఎత్తి ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 5,79,860 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ఇక ఎల్లంపల్లి ప్రాజెక్టుకు 3.20 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, అధికారులు 35 గేట్లు ఎత్తి 3.26 లక్షల క్యూసెక్కుల నీటిని కిందకు వదులుతున్నారు. కడెం, ఎస్సారెస్పీ ప్రాజెక్టుల నుంచి పెద్ద ఎత్తున నీరు చేరుతోంది. అలాగే నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. ప్రస్తుత నీటి మట్టం 694.27 అడుగులు ఉండగా, 2 గేట్లు ఎత్తి నీరు విడుదల చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలోని సింగూరు ప్రాజెక్టులో ఐదు గేట్లు ఎత్తి నీరు వదులుతున్నారు. ఇన్‌ఫ్లో 39,009, ఔట్‌ఫ్లో 43,466 క్యూసెక్కులు నమోదయ్యాయి. జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.
Crypto Scam : హైదరాబాద్‌లో క్రిప్టో కరెన్సీ మోసం.. నెక్ట్స్‌బిట్ యాప్ నిర్వాహకుడు అరెస్ట్
ఇకపోతే, ఏడు రోజులుగా ఏడు పాయల ఆలయం జలదిగ్బంధంలోనే ఉంది. సింగూరు గేట్లు ఎత్తడంతో మంజీరా నది ఉధృతంగా ప్రవహిస్తూ ఆలయ గర్భగుడిలోకి ప్రవేశించింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మిడ్ మానేరు ప్రాజెక్టుకు ఎస్సారెస్పీ నుంచి 11 వేల క్యూసెక్కులు, ఎల్లంపల్లి నుంచి 3,150 క్యూసెక్కులు, మూలవాగు నుంచి 1,516 క్యూసెక్కులు చేరుతున్నాయి. ప్రస్తుత నిల్వ 13.306 టీఎంసీలుగా ఉంది. తెలంగాణలో వర్షాలు, వరదలతో ప్రజలు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో అధికారులు ఎలాంటి ప్రమాదం తలెత్తకుండా నీటి విడుదలను నియంత్రితంగా కొనసాగిస్తున్నారు. పలు జిల్లాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు అధికారులు.