NTV Telugu Site icon

Telangana Elections 2023: ఎవరెన్ని ట్రిక్కులు చేసినా.. బీఆర్‌ఎస్ హ్యాట్రిక్ కొడుతుంది: హరీశ్ రావు

Harish Rao

Harish Rao

Minister Harish Rao Election Campaign in Ibrahimpatnam: ఎవరెన్ని ట్రిక్కులు చేసినా తెలంగాణ రాష్టంలో బీఆర్‌ఎస్ హ్యాట్రిక్ కొడుతుందని మంత్రి హరీశ్ రావు ధీమా వ్యక్తం చేశారు. 30 రోజులు మనం అందరం కలిసి కష్టపడితే.. వచ్చే ఐదేళ్లు సీఎం కేసీఆర్ సేవ చేస్తారన్నారు. కాంగ్రెస్ తమ పథకాలు కాపీ కొట్టి కొత్తగా చెబుతున్నదని విమర్శించారు. తనది అద్భుతమైన మేనిఫెస్టో అని హరీశ్ రావు పేర్కొన్నారు. రైతు బంధు సృష్టికర్త సీఎం కేసీఆర్ అని, వచ్చేసారి 16 వేలు ఇవ్వనోతున్నాం అని పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం బీఎంఆర్ కన్వెన్షన్ హల్లో నిర్వహించిన బీఆర్‌ఎస్ పార్టీ బూత్ కమిటీ సమావేశంలో మంత్రి హరీశ్ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఎమ్మల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సమావేశంలో మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ… ’30 రోజులు మనం అందరం కలిసి కష్టపడితే వచ్చే ఐదేళ్లు సీఎం కేసీఆర్, మీ ఎమ్మెల్యే సేవ చేస్తారు. చెడుకు వ్యాప్తి వేగం ఎక్కువ, అందుకే సోషల్ మీడియా వేదికగా కొందరు గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు. కళ్ల ముందు, ఇంటి ముందు కనబడ్డ అభివృద్ధినే నమ్మాలని ప్రజలకు చెప్పాలి. కర్ణాటక రైతుల పరిస్థితి పెనం మీద నుండి పోయ్యిల పడ్డట్టు అయ్యింది. 5 గంటల కరెంట్ మాత్రమే ఇస్తాం అని స్వయంగా అక్కడి సీఎం ప్రకటించారు. అందుకే పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి 3 గంటల కరెంట్ చాలు అని అంటున్నారు. కాంగ్రెస్ మన పథకాలు కాపీ కొట్టి కొత్తగా చెబుతున్నది. మనది అద్భుతమైన మేనిఫెస్టో, ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి. రైతు బంధు సృష్టికర్త మన కేసీఆర్. వచ్చేసారి 16 వేలు ఇవ్వనోతున్నాం. గతంలో ప్రభుత్వాలు రైతుల నుంచి డబ్బులు వసూలు చేస్తే.. సీఎం కేసీఆర్ గారు రైతులకు డబ్బులు ఇస్తున్నారు’ అని అన్నారు.

‘అన్ని సర్వేలు బీఆర్‌ఎస్ మంచి మేజార్టితో గెలుపు ఖాయం అంటున్నాయి. 400లకే గ్యాస్ సిలిండర్ ఇవ్వబోతున్నాము. సౌభాగ్య లక్ష్మి ద్వారా మహిళలకు 3 వేలు ఇవ్వబోతున్నాము. రేషన్ కార్డులు ఉన్న వాళ్లకు 6 కిలోల సన్నబియ్యం ఇవ్వబోతున్నాము. ఏటా 1300 కోట్లు ఎక్కువ ఖర్చు అవుతున్నా.. సీఎం గారు లెక్క చేయడం లేదు. గురుకులాల్లో ఇప్పటికే సన్నబియ్యం ఇస్తున్నాం. ఇకనుంచి పెద్దలకు కూడా సన్నబియ్యం ఇస్తాం. రైతు బీమా లాగానే, 5 లక్షల బీమా కోటి కుటుంబాలకు చెయ్యబోతున్నాం. బీఆర్‌ఎస్ గెలిచాక ఆసరా పింఛన్లు 5వేలు చేయబోతున్నాం. కేసీఆర్ అంటే నమ్మకం, కాంగ్రెస్ అంటే అపనమ్మకం. మన మేనిఫెస్టో సూపర్ హిట్.. అందుకే దీని పేరు కేసీఆర్ భరోసా అని పేరు పెట్టుకున్నాం. ఎవరెన్ని ట్రిక్కులు చేసినా హ్యాట్రిక్ కొట్టేది బీఆర్‌ఎస్ పార్టీనే. మంచిరెడ్డి కిషన్ రెడ్డిని గెలిపించి ఈ ప్రాంత అభివృద్ది కొనసాగేలా చూడాలి’ అని హరీశ్ రావు చెప్పారు.

Also Read: Nara Chandrababu: నా ప్రాణాలకు ముప్పు ఉంది.. ఏసీబీ కోర్టు జడ్జికి చంద్రబాబు లేఖ!

‘కొంత మంది డబ్బుల కోసం అమ్ముడు పోతే మేము ప్రజల్లో ఉంటాం. ప్రజల్ని నమ్ముకుంటాం. కాంగ్రెస్ పార్టీ అంటే మాటలు, మూటలు, ముఠాలు, మంటలు. ఎవరు పడితే వారు కాంగ్రెస్ పార్టీలో నేను సీఎం నేను సీఎం అంటున్నారు. అన్ని పార్టీలు కలిసి గత ఎన్నికల్లో పోటీ చేస్తే.. ప్రజలు ఈడ్చి కొడితే ఎక్కడో పడ్డారు. బీఆర్‌ఎస్ పార్టీకి 88 సీట్లు ఇచ్చారు. మనుషులను కొంటారు కావచ్చు.. కానీ తెలంగాణ ఆత్మగౌరవం కొనలెరు. ఉద్యమం సమయంలో ఒకరు రైఫిల్ పడితే, మరొకరు రాజీనామా చేయకుండా పారిపోయారు. తెలంగాణ ద్రోహులుగా ఉన్న వాళ్లు కేసీఆర్ కు సాటిగా వస్తారా?. కేసీఆర్‌కు పనితనం తప్ప పగతనం తెలియదు. లేదంటే అందరినీ ఎప్పుడో లోపల వేసేవారు’ అని మంత్రి హరీశ్ రావు చెప్పుకొచ్చారు.

Show comments