Kishan Reddy Visits Bhagyalakshmi Temple: తెలంగాణలో గురువారం జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ప్రలోభాలకు లొంగకుండా.. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును వినియోగించుకోవాలని కేంద్ర మంత్రి, బీజేపీ స్టేట్ చీఫ్ జి కిషన్ రెడ్డి కోరారు. ఇప్పటికే నాలుగు రాష్ట్రాల ఎన్నికలు అయిపోయాయని, తెలంగాణలో ఎన్నికలు ప్రశాంతంగా జరగాలని అమ్మవారిని కోరుకున్నట్లు వెల్లడించారు. హైదరాబాద్లోని చార్మినార్ను వద్దనున్న భాగ్యలక్ష్మి అమ్మవారిని ఈరోజు కిషన్ రెడ్డి దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.
అమ్మవారి దర్శనం అనంతరం కిషన్ రెడ్డి మాట్లాడుతూ… ‘దేశ ప్రజలు ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్న 41 మంది కార్మికులు సొరంగం నుంచి 17 రోజుల తర్వాత సురక్షితంగా బయటకు వచ్చారు. ఇది నిజంగా గొప్ప విషయం. వాళ్లు ధైర్యంగా బయటకు వచ్చినందుకు అమ్మవారికి ఈరోజు ప్రార్థనలు చేశాను. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు చర్చలు జరిపి.. కార్మికులను బయటకు తీసుకురావడం గొప్ప విషయం’ అని అన్నారు.
Also Read: Telangana Elections 2023: తెలంగాణ వ్యాప్తంగా ఎన్నికల సామగ్రి పంపిణీ ప్రారంభం!
‘ఇప్పటికే నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు ముగిసాయి. తెలంగాణలో గురువారం ఎన్నికలు ప్రశాంతంగా జరగాలి. ప్రజలెవరూ డబ్బులు సహా ఇతర ప్రలోభాలకు లొంగకుండా.. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలి. రాష్ట్ర ప్రజలు, దేశ ప్రజల మీద భాగ్యలక్ష్మి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని అమ్మవారిని ప్రార్థించాను. తెలంగాణ రాష్ట్రం అవినీతి రహిత, ప్రజాస్వామ్యయుత రాష్ట్రంగా వెల్లివిరియాలని అమ్మవారిని కోరుకున్నా’ అని కిషన్ రెడ్డి వెల్లడించారు.