Telangana Cyber Security Bureau: సైబర్ నేరగాళ్లపై తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TG CSB) చరిత్రలోనే అతిపెద్ద ఆపరేషన్ చేపట్టింది. సైబర్ ఉగ్రవాదులకు, మోసగాళ్లకు మ్యూల్ (నకిలీ/ఇతర వ్యక్తిగత) బ్యాంక్ ఖాతాలు, కేవైసీ (KYC) డాక్యుమెంట్లు సమకూరుస్తున్న ముఠాలపై రెండు వారాల పాటు ఈ ప్రత్యేక శోధన ఆపరేషన్ నిర్వహించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి వంటి 6 దక్షిణాది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒకేసారి దాడులు చేసిన బ్యూరో ప్రత్యేక బృందాలు మొత్తం 101 మంది నిందితులను అరెస్ట్ చేశాయి. అదుపులోకి తీసుకున్న వారిలో 83 మంది పురుషులు, 18 మంది మహిళలు ఉన్నారు. దేశవ్యాప్తంగా నమోదైన ఏకంగా 1,172 సైబర్ నేరాల కేసులతో ఈ నిందితులకు ప్రత్యక్ష సంబంధాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
అరెస్ట్ అయిన వారిలో విద్యాధికులు, వివిధ రంగాలకు చెందిన ఉద్యోగులు ఉండటం గమనార్హం. టాటా క్యాపిటల్ ఉద్యోగి, మనీ ఎక్స్ఛేంజ్ వ్యాపారి, మాజీ జవాన్, ఒక సినీ నటుడు, ఫిలిం టెక్నాలజీ డిప్లొమా పూర్తి చేసిన యువకుడు, ఫ్లిప్‌కార్ట్ ఉద్యోగి, మంజు గ్రూప్ మార్కెటింగ్ హెడ్, 6 ప్రధాన సెర్చింగ్, ఐటీ సంస్థల ఉద్యోగులు ఈ ముఠాలో భాగస్వాములుగా ఉంటూ మ్యూల్ ఖాతాలను విక్రయిస్తున్నట్లు ఆధారాలు లభించాయి. ఈ దాడుల్లో నిందితుల నుంచి భారీగా మ్యూల్ ఖాతాలకు సంబంధించిన డెబిట్ కార్డులు, బ్యాంక్ పాస్ పుస్తకాలు, చెక్ బుక్కులు, వైర్‌లెస్ పరికరాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీరికి దుబాయ్‌తో పాటు ఇతర విదేశీ సైబర్ నేరస్థుల నెట్‌వర్క్‌లతో కూడా లింకులు ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. సంబంధిత రాష్ట్రాల స్థానిక కోర్టుల్లో హాజరుపరిచిన అనంతరం నిందితులను ట్రాన్సిట్ వారెంట్‌పై హైదరాబాద్‌కు తరలిస్తున్నారు.

