తెలంగాణలోని రైతులకు వచ్చే సాగు సీజన్ (2026-27 ఆర్థిక సంవత్సరం) కోసం పంట రుణాల పరిమితిని తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంక్ (TSCAB) అధికారికంగా ఖరారు చేసింది. సాగు ఖర్చులు, ఎరువులు, విత్తనాల ధరల పెరుగుదలను దృష్టిలో ఉంచుకుని ఈ రుణ పరిమితులను నిర్ణయించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
రాష్ట్రంలోని రైతులు సాగు చేసే ప్రధాన పంటలకు సంబంధించి ఎకరాకు ఇచ్చే రుణ మొత్తాన్ని బ్యాంకులు ఖరారు చేశాయి. దీనివల్ల రైతులకు పెట్టుబడి సాయం సకాలంలో అందడమే కాకుండా, ప్రైవేటు వడ్డీ వ్యాపారుల వద్ద అప్పులు చేసే అవసరం తగ్గుతుంది.
Also Read:Tax on Mobile Data : మొబైల్ డేటాపై కొత్త పన్ను..! ఒక్క జీబీ డేటాపై ఎంత చెల్లించాలంటే..?
ప్రధాన పంటలు – రుణ వివరాలు (ఎకరాకు)..
1. వరి సాగు..
వరి పంట సాగు చేసే విధానాన్ని బట్టి రుణ పరిమితి మారుతుంది. సాధారణ వరి సాగుకు.. ఎకరాకు రూ.48,000 వరకు రుణం లభిస్తుంది. SRI (శ్రీ) వరి సాగుకు.. రూ.38,000గా నిర్ణయించారు. వరి విత్తనోత్పత్తి.. విత్తనాల తయారీ కోసం సాగు చేసే రైతులకు రూ.51,000 అందజేస్తారు.
2. పత్తి సాగు..
రాష్ట్రంలో అత్యధికంగా సాగయ్యే పత్తి పంటకు గణనీయమైన రుణ సాయం అందుతోంది. నీటి వసతి ఉన్న భూములకు ఎకరాకు రూ.52,000, వర్షాధార భూములకు ఎకరాకు రూ.50,000. పత్తి విత్తనోత్పత్తికి.. అత్యధికంగా రూ.1,50,000 వరకు రుణ పరిమితిని నిర్ణయించారు.
3. వాణిజ్య, ఇతర పంటలు..
మిరప సాధారణ సాగుకు రూ.90,000, మల్చింగ్ పద్ధతిలో సాగు చేస్తే రూ.1,00,000 వరకు రుణం పొందవచ్చు. పసుపు సాగుకు ఎకరాకు రూ.92,000 రుణంగా ఇస్తారు. మొక్కజొన్న సాగు విధానాన్ని బట్టి రూ.32,000 నుండి రూ.38,000 వరకు, స్వీట్‌కార్న్ కు రూ.43,000 వరకు పరిమితి ఉంది. కంది పంట సాగు ప్రాంతాన్ని బట్టి రూ.23,000 నుంచి రూ.27,000 వరకు లభిస్తుంది. ఉద్యానవన పంటల సాగులో ముఖ్యంగా టమాటాకు రూ.58,000, ఉల్లి సాగుకు రూ.49,000 గా ఖరారు చేశారు. పప్పు ధాన్యాల సాగులో ముఖ్యంగా పెసలు వంటి పంటలకు రూ.20,000 నుంచి రూ.22 వేల వరకు రుణం అందుతుంది.
Also Read:Stock Market: మార్కెట్ అల్లకల్లోలం.. లక్షల కోట్ల సంపద ఆవిరి
రుణం ఎలా పొందాలి..?
రైతులు తమ పరిధిలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు (PACS) లేదా వాణిజ్య బ్యాంకుల ద్వారా ఈ రుణాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. పట్టాదార్ పాస్ పుస్తకం, ఆధార్ కార్డు , సాగు వివరాలను సమర్పించాల్సి ఉంటుంది. ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా రుణాన్ని తిరిగి చెల్లించే రైతులకు వడ్డీ రాయితీ వర్తిస్తుంది.
ఈ రుణ పరిమితులు జిల్లా స్థాయి సాంకేతిక కమిటీల (DLTC) సిఫార్సుల మేరకు అపెక్స్ బ్యాంక్ ఖరారు చేస్తుంది. దీనివల్ల రైతులకు ఎరువులు, కూలీల ఖర్చులు, విత్తనాల కొనుగోలుకు ఆర్థిక వెసులుబాటు కలుగుతుంది. రైతులు ఈ రుణ సదుపాయాన్ని వినియోగించుకుని ఆధునిక పద్ధతుల్లో సాగు చేపట్టి లాభాలు గడించాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నారు.
