ఇండియన్ క్రికెట్ ప్లేయర్ అరుంధతి రెడ్డి ఈరోజు హైదరాబాద్ చేరుకోనున్నారు. ఈరోజు రాత్రికి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అవ్వనున్నారు. వన్డే ప్రపంచకప్ 2025 సాధించిన భారత జట్టులో ఉన్న అరుంధతి రెడ్డకి తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ సభ్యులు స్వాగతం పలకనున్నారు. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశారు. ఎయిర్‌పోర్ట్‌కు అరుంధతి కుటుంబ సభ్యులు కూడా వెళ్లనున్నారు.
అరుంధతి రెడ్డి ప్రస్తుతం భారత మహిళా జట్టులో ఫాస్ట్ బౌలర్‌గా ఉన్నారు. 2025 మహిళల వన్డే ప్రపంచకప్‌లో అరుంధతికి ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాలేదు. ఫస్ట్ మ్యాచ్ నుంచి ప్లేయింగ్ ఎలెవన్‌లో మార్పులు లేకుండానే కంటిన్యు అవడంతో.. టోర్నమెంట్ అంతటా ఆమె బెంచ్‌కే పరిమితం అయ్యారు. అరుంధతి టీమిండియా తరపున 11 వన్డేలు, 38 టీ20లు ఆడారు. వన్డేల్లో 15 వికెట్లు, టీ20లలో 34 వికెట్లు పడగొట్టారు. వరల్డ్ కప్ టోర్నీకి ముందు గాయం అయినా త్వరగా కోలుకుని జట్టులోకి ఎంపికయ్యారు.
Also Read: CP Sajjanar: మరలా తుపాకీ పట్టిన వీసీ సజ్జనార్.. థ్రిల్లింగ్‌గా ఉందంటూ పోస్ట్!
వన్డే ప్రపంచకప్ 2025ను గెలిచిన భారత మహిళా జట్టుతో ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ప్రతి ప్లేయర్‌తో ప్రధాని ప్రత్యేకంగా మాట్లాడి ప్రశంసించారు. ప్రధాని మోడీని కలిసినప్పుడు అరుంధతి రెడ్డి తన తల్లి గురించి చెప్పారు. ‘మీతో మాట్లాడే అవకాశం వస్తుందని నేను అనుకోలేదు సర్. చాలా సంతోషంగా ఉంది. మా అమ్మకి మీరు హీరో అట. ఈ విషయం చెప్పడానికే నాకు 4-5 సార్లు ఫోన్ చేసింది. నా హీరోని నువ్వు ఎప్పుడు కలుస్తున్నావు అని పదేపదే అడిగింది’ అని ప్రధానితో అరుంధతి చెప్పారు.