NTV Telugu Site icon

Glass Tube Center : రాష్ట్రంలో ఫార్మాస్యూటికల్ గ్లాస్ ట్యూబ్ తయారీ కేంద్రం..

Cm Revanth Reddy

Cm Revanth Reddy

Glass Tube Center: తెలంగాణ రాష్ట్రంలో మెటీరియల్‌ సైన్స్‌ రంగంలో ప్రపంచంలోనే పేరొందిన కార్నింగ్‌ ఇన్‌ కార్పొరేటేడ్‌ కంపెనీ తన కొత్త ఆవిష్కరణల అభివృద్ధికి ముందుకు వచ్చింది. నైపుణ్యాలతో పాటు పరిశ్రమల్లో నూతన సాంకేతిక ఆవిష్కరణలను అభివృద్ధి చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఎమర్జింగ్‌ ఇన్నొవేషన్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ రోనాల్డ్‌ వెర్క్లీ రెన్‌ ఆధ్వర్యంలోనే కార్నింగ్‌ ప్రతినిధుల బృందంతో చర్చల అనంతరం అవగాహన ఒప్పందాన్ని సీఎం రేవంత్‌ రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు ఓప్పంద పత్రాలపై అధికారికంగా సంతకాలు చేశారు. ఫార్మాస్యూటికల్ మరియు కెమికల్ రంగాలలో తెలంగాణను అత్యాధునిక పరిశోధన, అభివృద్ధి కేంద్రంగా తీర్చిదిద్దడంలో కార్నింగ్ భాగస్వామిగా పనిచేస్తుంది. తెలంగాణలో ఫార్మాస్యూటికల్ గ్లాస్ ట్యూబ్ తయారీ కేంద్రం ఏర్పాటుపై చర్చలు జరిగాయి. 2025 నుంచి వాణిజ్య ఉత్పత్తి ప్రారంభమవుతుందని ప్రకటించారు. తెలంగాణ ప్రభుత్వం, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ (UoH) సహకారంతో డాక్టర్ రెడ్డీస్ లిమిటెడ్, లారస్ ఫార్మా లిమిటెడ్ నిర్వహిస్తున్న ఫ్లో కెమిస్ట్రీ టెక్నాలజీ (FCT) హబ్‌లో కార్నింగ్ కంపెనీ కూడా పాల్గొంటోంది.

Read also: Gaddar Memorial: నక్లెస్ రోడ్డులో గద్దర్ స్మృతి వనం.. సర్కార్ కీలక నిర్ణయం

కార్నింగ్ కంపెనీ ఔషధ, రసాయన పరిశ్రమలలో ఆవిష్కరణలతో పాటు ఫ్లో కెమిస్ట్రీ టెక్నాలజీకి గణనీయంగా దోహదపడుతుంది. కొత్తగా అందుబాటులోకి వచ్చిన అధునాతన ఫ్లో రియాక్టర్ల సాంకేతికతను కార్నింగ్ కంపెనీ ప్రతినిధులు ముఖ్యమంత్రి నేతృత్వంలోని ప్రతినిధుల బృందానికి వివరించారు. ఈ అత్యాధునిక గ్లాస్ ట్యూబ్ తయారీ కేంద్రం ఫార్మా రంగం అభివృద్ధికి దోహదపడుతుంది. ఈ గాజు ట్యూబ్ లను ఫార్మాస్యూటికల్ ప్యాకేజింగ్ పరిశ్రమలో ఉపయోగిస్తారు. వీటిని తయారు చేయడానికి కంపెనీ వినూత్న వేగంతో కూడిన గాజు-పూత సాంకేతికతను ఉపయోగిస్తుంది. తెలంగాణలో ఇప్పటికే వేగంగా విస్తరిస్తున్న ఫార్మాస్యూటికల్ రంగం ఉత్పాదకతను ఈ కొత్త సదుపాయం మరింత మెరుగుపరుస్తుందని భావిస్తున్నారు. మరోవైపు వివింట్ ఫార్మా ప్రతినిధులతోనూ సీఎం రేవంత్ బృందం సమావేశమైంది. రూ. 400 కోట్లు, కంపెనీ విస్తరణకు ముందుకు వచ్చింది. జీనోమ్ వ్యాలీలో ఇంజెక్టబుల్స్ తయారీ కంపెనీని ఏర్పాటు చేయనున్నట్లు వివింట్ ఫార్మా తెలిపింది.
Paris Olympics 2024: ఒలింపిక్స్‌లో నేటి భారత షెడ్యూల్ ఇదే.. అత్యంత ముఖ్యమైన రోజు! పతకాలు పక్కా