OTR: “ఔర్ ఏక్ బార్.. కాంగ్రెస్ సర్కార్”.. అసెంబ్లీ ఎన్నికలకు పార్టీని సిద్ధం చేసే పనిలో ఇన్‌ఛార్జ్ బిజీ

Sandeep

Sandeep

OTR: తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్‌ సందీప్.. సెట్టింగ్స్‌లో బిజీ అవుతున్నట్టు కనిపిస్తోంది. పార్టీ నిర్మాణం.. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధం చేసే పనిలో ఆయన బిజీ అయినట్టు తెలుస్తోంది. బాధ్యతలు తీసుకున్న టైంలోనే.. సీఎం రేవంత్ రెడ్డి కూడా, వచ్చే ఎన్నికల నాటికి కూడా సందీప్ ఇన్చార్జ్‌గా ఉంటారని చెప్పేశారు. ఇక్కడ మరోసారి పార్టీని అధికారంలోకి తెచ్చే దిశగా అధిష్టానం ఇప్పటికే తన యాక్షన్ ప్లాన్‌ను సిద్ధం చేసిందట. దాన్ని అమలుచేసే పనిలోనే ప్రస్తుతం ఇంచార్జ్‌ సందీప్ బిజీ అయినట్టు చెబుతున్నాయి కాంగ్రెస్‌ వర్గాలు. ఇప్పుడు గాంధీభవన్‌లో అందరి ఆలోచన ఒక్కటే. తెలంగాణలో కాంగ్రెస్‌ను రెండోసారి అధికారంలోకి తీసుకురావడం ఎలాగన్న దానిపైనే ఫోకస్ నడుస్తోంది. ఇన్చార్జి సందీప్‌తో సీఎం రేవంత్ రెడ్డి, పిసిసి చీఫ్ మహేష్ గౌడ్.. పార్టీ ముఖ్య నేతలు అంతా సమావేశమయ్యారు. ఎమ్మెల్యేలు మంత్రులతో జరిగిన భేటీలో కూడా రెండోసారి అధికారంలోకి రావడం ఎలాగన్న అంశం చుట్టూతే ప్రధాన చర్చలు జరిగాయట. పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డితో పాటు ఎమ్మెల్యేలతో జరిగిన సమావేశంలో కూడా సలహాలు సూచనలే ఎక్కువగా చేశారు ఇన్ఛార్జ్‌.

ఆ క్రమంలోనే.. జిల్లాల వారీగా ఉన్న పరిస్థితులు, నాయకుల మధ్య సయోధ్య లాంటి అంశాలపై ఫోకస్ చేస్తున్నారట. డిసెంబర్ 15 నుంచి క్షేత్ర స్థాయి పర్యటనకు వెళ్ళాలన్న నిర్ణయం కూడా ఇందులో భాగమేనని అంటున్నారు. అలాగే.. ఉమ్మడి జిల్లా కేంద్రాలకు కాకుండా, కొత్త జిల్లా కేంద్రాలకు వెళ్ళాలని భావిస్తున్నారట సందీప్‌. అలాగే చేస్తేనే ఇంపాక్ట్‌ కరెక్ట్‌గా ఉంటుందన్నది ఆయన అభిప్రాయంగా తెలుస్తోంది. జిల్లా అధ్యక్షులు..మండల నాయకులతో కూడా నేరుగా మాట్లాడాలని నిర్ణయించుకున్నారు స్టేట్‌ వ్యవహారాల ఇన్ఛార్జ్‌. ఆ రకంగా క్షేత్ర స్థాయిలో వాస్తవాలు తెలుసుకుని సెట్ చేయాలని డిసైడ్ అయ్యింది పార్టీ. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి కూడా జిల్లాల పర్యటనకు సిద్ధమవుతున్నారు. ప్రభుత్వం అమలు చేసిన పథకాలు, వాటిని క్షేత్రస్థాయిలో లబ్ధిదారులకు అందించడమే లక్ష్యంగా పని చేయాలని నిర్ణయించారాయన. ఆ రకంగా పార్టీ కార్యకలాపాల మీద పీసీసీ చీఫ్‌ సమన్వయంతో ఇన్ఛార్జ్‌ దృష్టి పెడితే..అధికారిక కార్యక్రమాలపై సీఎం రేవంత్ ఫోకస్ చేయబోతున్నారు. అసెంబ్లీ ఎన్నికల దాకా.. ఈ కాంబినేషన్‌ని ఇలాగే ముందుకు తీసుకువెళ్తే..వర్కౌట్‌ అవుతుందని, పార్టీ రెండోసారి అధికారంలోకి రావడం పెద్ద సమస్యేం కాదని నమ్ముతున్నారట కాంగ్రెస్‌ లీడర్స్‌.