మధుయాష్కీ గౌడ్.. మహేష్ గౌడ్.. పి. సుదర్శన్‌రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులు, కాంగ్రెస్‌లోనూ కీలక పదవులు అలంకరించిన నేతలు. పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్‌గా ఉన్నారు మధుయాష్కీగౌడ్. ఇక మహేష్‌గౌడ్ అయితే పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్. మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి పీసీసీ కోశాధికారి. అంతా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన నాయకులు కావడంతో.. లోకల్‌గా పార్టీ బలంగా ఉందా అంటే కేడర్ దిక్కులు చూసే పరిస్థితి. దీనికి కారణం ముగ్గురు నాయకుల మధ్య సమన్వయం లేకపోవడమే.
Also Read : Bandi Sanjay : 5వ విడత ప్రజాసంగ్రామ యాత్ర.. ర్యూట్ మ్యాప్ ఆవిష్కరణ
అసెంబ్లీ సీటు ఆశిస్తున్న మధుయాష్కీ
జిల్లాలో టీఆర్ఎస్, బీజేపీలు కార్యక్రమాలు స్పీడ్ పెంచాయి. ఆ స్థాయిలో కాంగ్రెస్ కదలికలు లేవన్నది పార్టీ కేడర్ చెప్పేమాట. జిల్లాకు చెందిన ముగ్గురు నాయకులకు పదవులు ఇచ్చిన సమయంలో స్థానికంగా పార్టీ రేసుగుర్రంలా పరుగులు తీస్తుందని ఆశించారు కార్యకర్తలు. కానీ.. వారు జిల్లాకు ముఖం చాటేస్తున్నారు. మరో ఏడాదిలో అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో సేఫ్ సీటుకోసం గాలిస్తున్నారు నేతలు. గత ఎన్నికల్లో భువనగిరి ఎంపీ సీటు ఆశించి భంగపడ్డ మధుయాష్కీ.. చివరి క్షణంలో మరోసారి నిజామాబాద్ లోక్‌సభ బరిలో దిగి ఓడిపోయారు. ఇప్పుడు లోక్‌సభకు పోటీ చేసే ఆలోచన లేదట. అందుకే పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో తిరగడం లేదు. నిజామాబాద్ అర్బన్ సీటుతోపాటు.. హైదరాబాద్ పరిధిలోని మరో సెగ్మెంట్లలో కర్చీఫ్ వేసే పనిలో పడ్డారు యాష్కీ. అక్కడున్న ఓటర్లు… సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని పావులు కదుపుతున్నారట.
లీకులతో కాలం గడిపేస్తున్న మహేష్‌గౌడ్
ఇక పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో మహేష్‌గౌడ్.. జిల్లాను వదిలేసి గాంధీభవన్‌కే ఎక్కువ పరిమితం అవుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎక్కడ పోటీ చేయాలనే దానిపై తర్జన భర్జన పడుతున్నారట. కొద్దిరోజులు ఆర్మూరు.. మరికొన్ని రోజులు నిజామాబాద్ రూరల్ అని లీకులు ఇస్తున్నారట మహేష్‌గౌడ్. ఇది కేడర్‌లోనూ గందరగోళానికి దారితీస్తోందట. పీసీసీ కోశాధికారిగా ఉన్న పి. సుదర్శన్‌రెడ్డి.. బోధనలో అలికిడి చేయడం లేదు. దాంతో పార్టీ నేతలు అడ్వాన్స్ అవుతున్నారు. మాజీ మంత్రికి పోటీ చేయాలని మనసులో ఉన్నా.. ఆయన గుమ్మం దాటి బయటకు రాకపోవడంపై కేడర్ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. పనిలో పనిగా సుదర్శన్‌రెడ్డి అంటే గిట్టని కాంగ్రెస్ నాయకులు బోధనలో పట్టు సాధించేందుకు పావులు కదుపుతున్నారట.
సీనియర్ల తీరుపై పార్టీ వర్గాల్లో చర్చ
ఎన్నికల్లో ఎవరు ఎక్కడ నుంచి పోటీ చేస్తారో కానీ.. ముగ్గురు నేతల చర్యలు మాత్రం పార్టీలో చర్చగా మారుతున్నాయి. ఇందూరులో కాంగ్రెస్ పూర్వ వైభవం సాధించాలంటే సీనియర్లు కలిసి సాగాలని పార్టీ పెద్దలు పదే పదే చెబుతూ ఉన్నారు. అది పక్కన పడేసిన నాయకులు.. ఇలా ఎవరికివారుగా మారడంతో ప్రత్యర్థి పార్టీలు అడ్వాన్స్ అయ్యే ప్రయత్నాలు ఉన్నాయి.
