సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గీకరణ కేసు విచారణకు తెలంగాణ మంత్రి దామోదర రాజ నర్సింహ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజ నర్సింహ మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణ అంశంపై తెలంగాణ ప్రభుత్వం తరపున సుప్రీంకోర్టులో వాదనలు వినిపిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ కాంగ్రెస్ ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉందని ఆయన తెలిపారు. ఢిల్లీలో న్యాయవాదులతో మాట్లాడాం.. సుప్రీంకోర్టు కు హాజరై వాదనలు విన్నాం.. వాదనలు కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు. తొమ్మిదిన్నరేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వం దళిత, ఆదివాసీలు అస్తిత్వం కోల్పోయేలా వ్యవహరించిందన్నారు. గద్దర్, అందెశ్రీ లాంటి గాయకులను బీఆర్ఎస్ విస్మరించినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వారికి సరైన గుర్తింపు ఇచ్చిందన్నారు. సుప్రీంకోర్టుపై సంపూర్ణమైన విశ్వసం ఉందన్నారు. ఎవరికి వ్యతిరేకంగా వర్గీకరణ చెయ్యాలని అడగడం లేదన్నారు. ఎవరి వాటా వారికి దక్కలనే దీని ఉద్దేశ్యమని దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు.
అంతేకాకుండా.. తెలంగాణ తరపున వివేక్ తన్కా అనే సీనియర్ న్యాయవాదిని నియమించామని, సామాజిక న్యాయం దిశగా ముందుకు వెళ్లేందుకు ముఖ్యమంత్రి ఆదేశాలిచ్చారన్నారు. ముఖ్యమంత్రికి మా జాతి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. తెలంగాణ ప్రభుత్వ ముద్ర మార్చాలి..తెలంగాణ తల్లి ఏరకంగా ఉండాలనేది అభిప్రాయలు సేకరించాలన్నారు. తెలంగాణను టీజీ అని రిజిస్ట్రేషన్ ను కొనసాగించాలని నిర్ణయించామన్నారు. గత ప్రభుత్వం విస్మరించిన వారిని కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తిస్తుందని, తెలంగాణ కోసం పోరాడిన వారిని తెలంగాణ ప్రభుత్వం గుర్తిస్తుందన్నారు. ఎస్సీ వర్గీకరణ కేసు త్వరగా పూర్తవుతుందని భావిస్తున్నామని ఆయన అన్నారు. వర్గీకరణ ఎవరికి వ్యతిరేకం కాదు..ఎవరి వాటా వారికి దక్కలనేది దీని ఉద్దేశమని, ఎస్సీ సబ్ ప్లాన్ అమలు దిశగా కాంగ్రెస్ ముందుకు వెళ్తుందని ఆయన వెల్లడించారు.