CM Revanth Reddy Took Blessings from Secunderabad Ujjani Mahakali: సికింద్రాబాద్ ఉజ్జయిని మహాకాళి అమ్మవారిని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం అమ్మవారిని దర్శించుకొని పట్టు వస్త్రాలు సమర్పించారు. ప్రత్యేక పూజలు చేసిన సీఎం మొక్కులు చెల్లించారు. అనంతరం ఆలయ పండితులు సీఎంకు వేదమంత్రోచ్ఛరణల నడుమ దీవించి.. అమ్మవారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ పండితులు ఉజ్జయిని మహాకాళి అమ్మవారి శేష వస్త్రంను సీఎంకు అందించారు. సీఎం రాకతో అక్కడ భారీ భద్రతను ఏర్పాటు చేశారు.
అంతకుముందు మంత్రి పొన్నం ప్రభాకర్ కుటుంబ సమేతంగా ఉజ్జయిని మహాకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. పట్టు వస్త్రాలతో పాటు అమ్మవారికి తొలి బోనం సమర్పించారు. బోనాల జాతర సందర్భంగా బీజేపీ ఎంపీ లక్ష్మణ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ తదితరులు అమ్మవారిని దర్శించుకున్నారు. మరోవైపు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తుండటంతో ఆలయ పరిసరాల్లో సందడి నెలకొంది. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు క్యూలైన్లలో వేచి ఉన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు.