CM Revanth Reddy: దీపావళి పండుగ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వినూత్న కార్యక్రమానికి పిలుపునిచ్చారు. పేదల సొంతింటి కల నెరవేరిన వేళ, ఈ పండుగను ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులతో కలిసి జరుపుకోనున్నట్లు ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా వెల్లడించారు. “మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి” అని పేర్కొంటూ, పేదల ఇళ్లలో నిండే వెలుగులు, వారి సొంతింటి సంతోషంలో తాను స్వయంగా పాలుపంచుకోనున్నట్లు సీఎం స్పష్టం చేశారు. ఈ పండుగ వేళ ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు సైతం క్షేత్రస్థాయిలో ఉన్న ఇందిరమ్మ ఇండ్లకు స్వయంగా వెళ్లి, లబ్ధిదారులతో కలిసి దీపావళి జరుపుకోవాలని రేవంత్ రెడ్డి సూచించారు. పేదల ముఖాల్లో ఆనందం నింపేలా ప్రభుత్వ యంత్రాంగం, ప్రజాప్రతినిధులు వారితో మమేకం కావాలని ఆయన పిలుపునిచ్చారు. సీఎం తీసుకున్న ఈ నిర్ణయం ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపగా, ప్రజాప్రతినిధులు కూడా తమ తమ నియోజకవర్గాల్లో లబ్ధిదారుల వద్ద పండుగ జరుపుకునేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి ..!
పేదల సొంతింటి కల సాకారమైన వేళ, ఈ దీపావళి పండుగ శుభవేళ…
ఇందిరమ్మ ఇండ్లలో, లబ్ధిదారుల సొంతింటి సంతోషంలో… నేను సైతం పాలుపంచుకోనున్నాను.
ఈ దీపావళి సందర్భంగా, నేను ఇందిరమ్మ ఇంట్లో, లబ్ధిదారులతో కలిసి పండుగ జరుపుకోనున్నాను.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు.. మీరు సైతం ఇందిరమ్మ ఇండ్లకు వెళ్లి లబ్ధిదారులతో కలిసి దీపావళి పండుగ జరుపుకోవాలని కోరుతున్నాను.
#MaaIndirammaIntloDeepavali
#IndirammaIndlu— Revanth Reddy (@revanth_anumula) November 5, 2026

