Site icon NTV Telugu

Online Fraud: చదివింది ఇంటరే కానీ.. చేసింది మాత్రం బెట్టింగ్ యాప్! చివరకు

Sam (1)

Sam (1)

బెట్టింగ్ యాప్స్‌పై తెలంగాణ సీఐడీ అధికారులు కొరఢా ఝుళిపిస్తున్నారు. ఏకకాలంలో 6 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించి 8 మంది బెట్టింగ్ యాప్ ఆపరేటర్లను అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన సూత్రధారులు ఉన్నారనే విషయాన్ని గమనించిన సీఐడీ వారికోసం వేట సాగిస్తోంది. మరోవైపు చిత్తూరు జిల్లాలో కేవలం ఇంటర్ చదివి ఓ యువకుడు బెట్టింగ్ యాప్ రూపొందించాడు. కోట్లకు పడగలెత్తాడు. కానీ చివరికి పోలీసులు అరెస్ట్ చేయడంతో ఇప్పుడు కటకటాల్లో ఉన్నాడు.

దేశవ్యాప్తంగా లక్షలాది మంది యువతను బెట్టింగ్ యాప్స్ దోచుకుంటున్నాయి. చిన్న మొత్తాల్లో డిపాజిట్ చేయించి.. పెద్ద గెలుపు వాగ్దానాలు చేసి చివరికి డబ్బు మొత్తం మింగేస్తున్నాయి. బెట్టింగ్ యాప్స్ వలలో పడి.. పెట్టుబడి పెట్టిన వారంతా మోసపోయి ఆత్మహత్యలకు పాల్పడిన ఘటనలు ఎన్నో చూశాం. దీంతో ఈ బెట్టింగ్ యాప్స్ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తెలంగాణ సీఐడీ అధికారులు దేశవ్యాప్తంగా ఆకస్మిక దాడులు నిర్వహించారు. నిందితులు, బెట్టింగ్ యాప్ ఆపరేటర్లుగా వ్యవహరిస్తున్న వారి లొకేషన్లను గుర్తించి 6 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు.

రాజస్థాన్, గుజరాత్, పంజాబ్‌లో ఒకేసారి ఆరు లొకేషన్లలో దాడులు నిర్వహించారు తెలంగాణ సీఐడీ అధికారులు. 8 మంది బెట్టింగ్ యాప్స్‌కు సంబంధించిన ఆపరేటర్లను అదుపులోకి తీసుకున్నారు. తాజ్ 0077, ఫెయిర్‌ప్లై లైవ్, ఆంధ్ర 365, వీఎల్‌ బుక్, తెలుగు 365, యెస్ 365 పేర్లతో నడిపిన ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ వెనుక ఉన్న రహస్యాలను వెలుగులోకి తీసుకొచ్చారు. ఈ బెట్టింగ్ యాప్‌ల వెనుక ఉన్న ముఠా పబ్లిక్ ట్రస్ట్‌ను బాగా వాడుకుంది. యాప్‌లలో ఆటలు, లాటరీలు, క్రికెట్ బెట్టింగ్స్ పేరిట డబ్బులు పోగుచేసి.. ఎవరికి గెలుపు రాకుండా సాఫ్ట్‌వేర్ మానిప్యులేషన్ చేసి ప్రజల నుంచి దోపిడీకి పాల్పడింది. బెట్టింగ్ యాప్‌లలో మొదట లాభాలు చూపిస్తారు. దీంతో ఆశపడి తర్వాత పెట్టుబడి ఎక్కువగా పెడతారు కాబట్టి ఎక్కువగా పెట్టుబడులు పెట్టిన తర్వాత లాభాలన్నీ కంపెనీకి చెందిన బెట్టింగ్ యాప్ సాఫ్ట్‌వేర్ మ్యానిప్యులేట్ చేసి మోసాలకు పాల్పడుతున్నారు. రాజస్థాన్, గుజరాత్, పంజాబ్‌లో ఒకేసారి దాడులు చేసిన సీఐడీ టీంలు… భారీగా హార్డ్‌వేర్ పరికరాలను, డేటాను సీజ్ చేశాయి. వీటిలో లక్షల లావాదేవీల వివరాలు బయటపడ్డాయి. బెట్టింగ్ యాప్ ఆపరేషన్ వెనుక ఉన్న ప్రధాన సూత్రధారులు విదేశాల్లో ఉంటున్నట్టు సీఐడీ అధికారులు గుర్తించారు. వారిని గుర్తించడానికి దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోందని తెలిపారు.

Also Read: IND vs BAN: అభిషేక్ శర్మ హాఫ్ సెంచరీ.. బంగ్లాదేశ్‌ టార్గెట్ ఏంటంటే?

మరోవైపు చిత్తూరు జిల్లా పలమనేరులో బెట్టింగ్ యాప్ ద్వారా కోట్ల రూపాయలు సంపాదించాడు చందు అనే యువకుడు. చివరకు అడ్డంగా దొరికిపోయాడు. ఇంటర్ చదివిన చందు.. మొదట మొబైల్ షాపు నడిపి, తరువాత క్రికెట్ బెట్టింగ్స్ ప్రారంభించాడు. ‘రాధా ఎక్స్ఛేంజ్’ పేరుతో బెట్టింగ్ యాప్ సృష్టించి యువతను మోసం చేశాడు. ప్రభుత్వ ఉద్యోగులు సైతం అతని వలలో చిక్కుకున్నారు. పోలీసులు చందును అరెస్టు చేసి, అతను కొనుగోలు చేసిన ఆస్తులను గుర్తించారు. చందు చదివింది ఇంటర్ అయినా మోసాల్లో మాత్రం ఆరితేరాడు. సెల్ ఫోన్ షాపు నడుపుతూ, బెట్టింగ్ యాప్ తయారు చేయించుకొని యువతే లక్ష్యంగా రూ.కోట్లలో మోసాలకు పాల్పడ్డాడు.

చందు పెట్టిన బెట్టింగ్ యాప్ మాయలో పడి పలమనేరుకు చెందిన ఓ కానిస్టేబుల్ కూడా అప్పులపాలై ఆత్మహత్యకు యత్నించాడు. ఈ బెట్టింగ్ యాప్‌తో రూ.70 లక్షలు పోగొట్టుకున్న పలమనేరు మండలంలోని నేలపల్లెకు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసులో చందు ముందస్తు బెయిల్ తెచ్చుకున్నాడు. ఇదే యాప్‌లో తాను రూ.2 లక్షలు పోగొట్టుకున్నట్లు తాజాగా రాయలపేటకు చెందిన లక్ష్మీనారాయణ ఫిర్యాదుతో పోలీసులు మరో కేసు పెట్టారు. ఈ కేసులో చందూతో పాటు 11 మంది కుటుంబసభ్యులు, బంధువులను చేర్చారు. చందూను అరెస్టుచేసి కోర్టులో హాజరుపరిచారు.

ఇక బెట్టింగ్ యాప్ ద్వారా చందు కొన్న ఆస్తులు చూసి పోలీసులే షాక్ అవుతున్నారు. బెట్టింగ్‌లో వచ్చిన డబ్బుతో బెంగళూరు, తిరుపతి, హైదరాబాద్, చిత్తూరు తదితర నగరాల్లో భవంతులు, స్థలాలు కొన్నాడు . సొంతూరిలోనూ విలాసవంతమైన భవనం నిర్మించాడు. అందులో ఫేస్ సిస్టం ఏర్పాటు చేసుకున్నాడు. ప్రతి గదిలోనూ ఆధునిక ఫర్నిచర్ అమర్చుకున్నాడు. బంగారు ఆభరణాలు, ఖరీదైన ల్యాప్టాప్‌లు, మొబైళ్లు, రూ.70 లక్షల ఖరీదైన ఎలక్ట్రిక్ కారు, ద్విచక్ర వాహనాలు కొన్నాడు. ఐతే చందు యాప్ తయారు చేయడానికి ఎవరెవరు సహకారం అందించారు అనే అంశాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Exit mobile version