Caste Enumeration : రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి సంబంధించిన సామాజిక, ఆర్ధిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల వివరాల సేకరణ కై ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే కోసం క్షేత్రస్థాయిలో విస్తృత ఏర్పాట్లు చేయడం జరుగుతుందని అదిలాబాద్ జిల్లా జిల్లా కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. ఈ సందర్భంగా జైనద్ మండలం రైతువేధిక లో ఏర్పాటు చేసిన ఎన్యూమరెటర్లు, సూపర్వైజర్ ల శిక్షణా కార్యక్రమం లో జిల్లా కలెక్టర్ రాజర్షి షా ముఖ్య అతిథిగా పాల్గొని సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే లక్ష్యాలు, విధివిధానాలు, కార్యాచరణ గురించి వివరిస్తూ, సర్వే విజయవంతానికి చేపట్టాల్సిన చర్యలపై మార్గనిర్దేశం చేశారు. ఈ సందర్భంగా సిబ్బందికి మాస్టర్ ట్రైనర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పిస్తున్న తీరును పరిశీలించారు. నవంబర్ 1 వ తేదీ నుండి 3 వ తేదీ వరకు ఇండ్ల జాబితా (హౌసింగ్ లిస్ట్) సర్వే చేసి ఇంటింటికి స్థిక్కర్ అతికించాలని, 6 వ తేదీ నుండి 18 వ తేదీ వరకు ఇంటింటి సర్వే నిర్వహించడం జరుగుతుందనీ తెలిపారు . ఎంతో ప్రాధాన్యతతో కూడిన ఈ కార్యక్రమంలో ఇంటింటి సర్వే చేసేటప్పుడు అందరిని భాగస్వాములు చేస్తూ సర్వేను సమగ్రంగా జరిపించాలని సూచించారు. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి దోహదపడాలన్న సమున్నత ఆశయంతో ప్రభుత్వం ఈ సర్వేను చేపడుతోందని అన్నారు. సర్వే కోసం ఆయా బ్లాక్ ల వారీగా ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లను గుర్తించడం జరిగిందనీ, 2011 జనాభా గణన అనుసారంగా ఎన్యూమరేషన్ బ్లాక్ లను ఏర్పాటు చేసుకోవాలని, కొత్తగా ఏర్పడిన కాలనీలు ఉంటే బ్లాక్ లను అప్ డేట్ చేసుకోవాలని అన్నారు. 150 కుటుంబాలకు ఒకరు చొప్పున ఎన్యుమరేటర్ల ను నియమించడం జరిగిందనీ, పది మంది ఎన్యుమరేటర్లకు ఒకరు చొప్పున సూపర్వైజర్లను సర్వే ప్రక్రియ పర్యవేక్షణ కోసం గుర్తించడం జరిగిందనీ తెలిపారు.
Mayonnaise Ban In Telangana : తెలంగాణలో మయోనైజ్ బ్యాన్.. ఎందుకంటే?
ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లకు రెమ్యూనరేషన్ చెల్లించడం జరుగుతుందన్నారు. ఏ ఒక్క కుటుంబం సైతం మినహాయించబడకుండ ప్రతి ఎన్యుమరేషన్ బ్లాక్ లో ఇంటింటి సర్వే జరిగేలా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని అన్నారు. సర్వే నిర్వహణ కోసం అవసరమైన మెటీరియల్ ను ఎన్యుమరేటర్లకు సమకూర్చడం జరుగుతుందని అన్నారు. సర్వే కోసం ఎన్యుమరేటర్లు గ్రామాలలో వచ్చే సమయానికే ప్రజలు ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ధరణి పాస్ బుక్ లను వారి దగ్గర ఉండేలా ఒకరోజు ముందే విస్తృత ప్రచారం, టామ్ టామ్ వేయించాలని సూచించారు. సర్వే కోసం వెళ్లిన సమయంలో ఎన్యుమరేటర్లు హుందాగా వ్యవహరించాలని, సర్వే ప్రధాన ఉద్దేశ్యాన్ని తెలియజేయాలని, సమాచారాన్ని ఆన్ లైన్లో నిక్షిప్తం చేసేందుకు సరిపడా ఆపరేటర్లను నియమించి వారికి శిక్షణ కూడా ఇవ్వడం జరుగుతుందని ఆన్నారు.