Site icon NTV Telugu

Cabinet Meeting: ఈ నెల 9న తెలంగాణ కేబినెట్‌ భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ

Telangana Cabinet

Telangana Cabinet

Cabinet Meeting: తెలంగాణ కేబినెట్‌ భేటీ ఈ నెల 9న జరగనుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్‌లో మధ్యాహ్నం 2 గంటలకు ఈ సమావేశాన్ని నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు సీఎస్ శాంతికుమారి శనివారం అన్ని శాఖలకు సమాచారం ఇచ్చారు. ఈ మంత్రివర్గ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్‌సీ, యాసంగి ధాన్యం కొనుగోళ్లు, కొత్త క్రీడా విధానం సహా పలు కీలక అంశాలపై మంత్రిమండలి నిర్ణయాలు తీసుకోనుంది. యాసంగి సీజన్‌కు సంబంధించి దొడ్డుబియ్యం కొనుగోలుపై కేంద్రం పేచీ పెడుతుందనే ఇబ్బంది రాకుండా.. ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని చూస్తోంది. వచ్చే వానాకాలం సాగుకు కావాల్సిన విత్తనాలు, ఎరువులు, ఇతర సన్నద్ధతలపైనా మంత్రిమండలి దిశానిర్దేశం చేయనుంది.

Read Also: Allahabad High Court: కేంద్రం ఆవును రక్షిత జాతీయ జంతువుగా ప్రకటిస్తుందని ఆశిద్దాం..

రాష్ట్ర ప్రభుత్వం అమలులోకి తేనున్న కొత్త క్రీడా విధానంపై సిద్ధమైన ముసాయిదాకు ఆమోదముద్ర వేసే అవకాశం ఉంది. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ స్థలాల్లో నిర్మించుకున్న ఇళ్ల క్రమబద్ధీకరణపైనా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మెస్ ఛార్జీల పెంపుదలకు రాష్ట్ర మంత్రివర్గ ఉపసంఘం చేసిన సిఫార్సులకు మంత్రిమండలి ఆమోదం తెలపనుంది. పోడు భూములపై హైకోర్టు నోటీసులకు సమాధానం ఇచ్చే అంశంపై చర్చించనున్నట్లు సమాచారం. కొత్త పీఆర్‌సీ కోసం ఇప్పటికే ఉద్యోగ సంఘాల నుంచి వినతులు వస్తున్నాయి. విద్యుత్‌ ఉద్యోగులకు కొత్త పీఆర్‌సీపై సర్కారు నిర్ణయం తీసుకోనుంది.

Exit mobile version