Jayashankar Bhupalpally: తెలంగాణ రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావం వల్ల వర్షాభావం తీవ్రమై, భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. పాలమూరు వంటి కరువు జిల్లాల్లో నేల నెర్రలు బారాయి. పొలాల్లో వేసిన బోర్లలో సైతం నీరు లేక ఎండిపోతున్నాయి. కానీ.. ఈ గడ్డు పరిస్థితుల మధ్య కూడా మన రాష్ట్రంలోని ఓ ప్రాంతంలో మాత్రం అద్భుతం ఆవిష్కృతమవుతోంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం కాళేశ్వరం గ్రామపంచాయతీ పరిధిలోని పూసుకుపల్లి శివారులో ప్రకృతి చూపించిన ఈ మాయ స్థానికులను నిశ్చేష్టులను చేస్తోంది. ఎటు చూసినా నీటి కోసం రైతులు అల్లాడుతున్న వేళ, పూసుకుపల్లి సమీపంలో ఎలాంటి మోటార్ సహాయం లేకుండానే నేల తల్లి కడుపులోంచి నీటి ధారలు ఉబికి వస్తున్నాయి.
గత వర్షాకాలంలో రైతులు ఇక్కడ మూడు బోర్లు వేయించినట్లు చెబుతున్నారు. ఈ బోర్లకు మోటార్లు బిగించలేదు. మోటర్లు లేకపోయినా భూమి నుంచి జలధారలు ప్రవాహంలా బయటకు పొంగి పొర్లుతుండటం కనువిందు చేస్తోంది. ఒకవైపు ఎండల తీవ్రతకు చుట్టుపక్కల బావులు, బోర్లు బోసిపోతుంటే, ఈ ప్రాంతంలో మాత్రం నిరంతరాయంగా నీరు పైకి రావడం చూసి ప్రజలు ఆశ్చర్యంలో మునిగిపోతున్నారు. సాధారణంగా బోర్ల నుంచి నీటిని లాగడానికి విద్యుత్, మోటార్ల పైనే ఆధారపడే పరిస్థితుల్లో, ఈ విధంగా నేల నుంచి స్వయంభూవులా జలాలు పొంగిపొర్లడం పూసుకుపల్లి పరిసరాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఈ అరుదైన ప్రకృతి వింతను, పారే నిర్మల జలధారలను తిలకించేందుకు సమీప గ్రామాల ప్రజలు ఆసక్తిగా తరలివస్తున్నారు. ప్రకృతి సృష్టించిన ఈ విచిత్ర దృశ్యం అందరినీ కట్టిపడేస్తూ, కరువు కోరల్లోనూ ఊరటనిచ్చే ఓ అద్భుతంగా నిలుస్తోంది.

