Harish Rao Arrested After BRS Black T-Shirt Protest: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వినూత్నంగా నిరసన చేపట్టారు. బీఆర్ఎస్ నేతలు గన్‌పార్క్ నుంచి నల్ల రంగు టీషర్టులు ధరించి అసెంబ్లీకి వచ్చారు. అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించిన అనంతరం బీఆర్ఎస్ నేతలు అసెంబ్లీకి చేరుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలును డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. ముఖ్యంగా ఎన్నికల సమయంలో ఇచ్చిన 420 హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.
బీఆర్ఎస్ నేతలను నల్ల టీషర్టులతో అసెంబ్లీ ప్రాంగణంలోకి అనుమతించేందుకు పోలీసులు నిరాకరించారు. ఈ క్రమంలో అసెంబ్లీ గేటు వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. నల్ల టీషర్టులు ధరించి అసెంబ్లీలోకి వెళ్లేందుకు బీఆర్ఎస్ నేతలు పట్టుబట్టగా.. భద్రతా కారణాల దృష్ట్యా అనుమతించలేమని పోలీసులు స్పష్టం చేశారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కొంతసేపు ఇరువర్గాల మధ్య తోపులాట కూడా చోటుచేసుకుంది. ఈ క్రమంలో కొందరు బీఆర్ఎస్ నేతలు కిందపడిపోయారు. అసెంబ్లీ గేటు వద్ద చోటుచేసుకున్న ఈ గందరగోళ సమయంలో ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి కంటతడి పెట్టుకున్నారు.
అసెంబ్లీ గేటు దగ్గర మాజీ మంత్రి హరీశ్‌రావు తన చొక్కా విప్పి నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వంపై తమ నిరసనను మరింత తీవ్రంగా వ్యక్తం చేశారు. ఈ పరిణామాల అనంతరం అసెంబ్లీ ప్రాంగణం సమీపంలో హరీశ్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు. మాజీ మంత్రి కేటీఆర్ సహా పలువురు బీఆర్ఎస్ నేతలను కూడా అరెస్ట్ చేసు పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్నారు. అసెంబ్లీ సమావేశాల తొలిరోజే అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో అసెంబ్లీ సమావేశాల్లో అధికార, ప్రతిపక్షాల మధ్య మరింత వాడీవేడి చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది.

