NTV Telugu Site icon

Telangana Assembly 2024 Live Updates: తెలంగాణ అసెంబ్లీ లైవ్ అప్‌డేట్స్!

Telangana Assembly 2024

Telangana Assembly 2024

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. గురువారం ఐదవ రోజు వాడివేడిగా సమావేశం జరగనుంది. నేడు అసెంబ్లీలో నాలుగు ప్రభుత్వ బిల్లులతో సహా భూభారతి బిల్లుపై చర్చ కొనసాగనుంది. తెలంగాణ మున్సిపాలిటీ సవరణ బిల్లు, గ్రేటర్ హైదరాబాద్‌ మున్సిపల్ కార్పొరేషన్‌ బిల్లు, తెలంగాణ పంచాయతీరాజ్ సవరణ బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. నేడు అసెంబ్లీలో ప్రభుత్వ అప్పులు, చెల్లింపులపై సహా రైతు భరోసాపై చర్చ జరగనుంది.

  • 19 Dec 2024 02:32 PM (IST)

    రూ.24 కోట్లకు పైగా అప్పులు తీర్చాం:

    రూ.12,117 కోట్లను కాంగ్రెస్ ప్రభుత్వం వడ్డీలు, అప్పుల పేరిట కట్టిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. 'రూ.24 కోట్లకు పైగా అప్పులు తీర్చాం. మార్చి నుంచి ఇప్పటి వరకు మొదటి తేదీనే ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నాం. మేము అధికారంలోకి వచ్చినప్పుడు ఆర్థిక పరిస్థితిపై శ్వేత పత్రం విడుదల చేశాం. మొత్తం అప్పు 6 లక్షల 71 వేల కోట్లు ఉంది. ఏడాదిలో మీరు అప్పులు చేశారంటూ సభ్యులు ప్రశ్నించారు. హరీష్ రావు ఆందోళన చెందుతూ సభలో, బయట మాట్లాడుతున్నారు. నేను చెప్పే వివరాలు తప్పని ఆర్బిఐ పేరుతో కొన్ని పత్రాలు చూపిస్తున్నారు. ఉన్నవి లేనట్టు, లేనివి ఉన్నట్లు చెప్పడం హరీష్ రావుకు వెన్నతో పెట్టిన విద్య' అని భట్టి విమర్శించారు.

  • 19 Dec 2024 01:29 PM (IST)

    సీఎం వైఖరిని నిరసిస్తూ వాకౌట్ చేశాం:

    'శాసనమండలిలో ముఖ్యమంత్రి వైఖరి నిరసిస్తూ వాకౌట్ చేశాం. సలహాదారులు పేరుతో లక్షలాది రూపాయలు ఖర్చు చేస్తున్నారని గతంలో కామెంట్ చేసిన సీఎం నేడు సలహదారులను పెట్టుకున్నారు. ముఖ్యమంత్రి ద్వంద్వ వైఖరి నిరసిస్తూ వాకౌట్ చేస్తున్నాము. భూ భారతి మీద అసెంబ్లీలో చర్చ చేస్తున్నారు. చట్ట సభలో ఆమోదం తెలుపకముందే ప్రకటనలు ఇస్తున్నారు. చట్ట సభలంటే గౌరవము లేకుండా పోయింది' అని శాసనమండలి మీడియా పాయింట్ మధుసూదన చారి మండిపడ్డారు.

  • 19 Dec 2024 01:26 PM (IST)

    అంబేడ్కర్‌ విగ్రహం వద్ద కాంగ్రెస్‌ ధర్నా:

    తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో అంబేడ్కర్‌ విగ్రహం వద్ద కాంగ్రెస్‌ ధర్నా చేస్తోంది. పీసీసీ చీఫ్‌ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ధర్నా చేస్తున్నారు. మంత్రులు పొన్నం ప్రభాకర్‌, జూపల్లి కృష్ణారావు ఆందోళనలో పాల్గొన్నారు. అంబేడ్కర్‌పై అమిత్‌ షా వ్యాఖ్యలకు నిరసనగా కాంగ్రెస్‌ ధర్నా చేస్తోంది. అమిత్‌ షా క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్‌ చేస్తూ కాంగ్రెస్‌ ఆందోళన చేపట్టింది.

  • 19 Dec 2024 12:45 PM (IST)

    హక్కుల ఉల్లంఘన నోటీసు:

    శాసనసభ ఆమోదం పొందని భూ భారతి బిల్లును రాష్ట్ర ప్రభుత్వం చట్టంగా ప్రకటించిందని బీఆర్ఎస్ అంటోంది. ప్రజలను తప్పుదోవ పట్టించారంటూ.. సభా హక్కుల ఉల్లంఘన నోటీసును బీఅర్ఎస్ శాసనసభ పక్షం ఇచ్చింది. శాసనసభా హక్కులను కాపాడాలంటూ స్పీకర్‌కు వినతి పత్రం ఇచ్చారు.

  • 19 Dec 2024 12:37 PM (IST)

    ఆకుపచ్చ కండువాలతో మండలి:

    'నాడు రైతులకు రుణమాఫీ చేస్తాను అని సీఎం రేవంత్ రెడ్డి దేవుళ్ల సాక్షిగా హామీ ఇచ్చారు. ఆ హామీని నెరవేర్చనందుకు ఈ రోజు ఆకుపచ్చ కండువాలతో మండలికి వచ్చాము. హామీని నెరవేర్చనందుకు మీ ద్వారా మా నిరసన తెలియజేస్తున్నాము' అని ఎమ్మెల్సీ కవిత తెలిపారు.

  • 19 Dec 2024 11:21 AM (IST)

    పరిష్కారం కూడా చూపండి: ఎమ్మెల్సీ కవిత

    తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పరిపాలన సౌలభ్యం కోసం కొత్త జిల్లాలు ఏర్పాటు చేసుకున్నామని ఎమ్మెల్సీ కవిత అన్నారు. 'ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం 317 జీవో తెచ్చుకున్నాము. 317 జీవో వల్ల సమస్యలు ఉన్నాయి అని చెబుతున్నారు. సమస్యలు ఉన్నాయి అని చెప్పడమే కాకుండా.. పరిష్కారం కూడా చూపండి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏడాది అవుతుంది. మీరు ఎం చేస్తున్నారు?, ఇంకా మమ్మల్ని పాయింటవుట్ చేయడం హాస్యాస్పదంగా ఉంది' అని కవిత అన్నారు.

  • 19 Dec 2024 11:18 AM (IST)

    బీఆర్ఎస్ వాళ్లు రోజుకో బాగోతాలు వేస్తున్నారు:

    బీఆర్ఎస్ వాళ్లు రోజుకో బాగోతాలు వేస్తున్నారు అని ఎమ్మెల్యే మందుల శామ్యూల్ ఫైర్ అయ్యారు. ఇసుక దోపిడీ, భూములు దోపిడీ చేసి ఇవాళ వేషాలు వేస్తున్నారన్నారని విమర్శించారు. ఆటోలో వచ్చి.. ఎంత మంది ఆటో వాళ్లకు మేలు చేశారు? అని ఎద్దేవా చేశారు. ఆర్టీసీ కార్మికులు 34 మంది చనిపోవడానికి కారణం మీరు కాదా? అని ప్రశ్నించారు.

  • 19 Dec 2024 11:14 AM (IST)

    హరీశ్‌రావు vs కోమటిరెడ్డి:

    సభలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి, ఎమ్మెల్యే హరీశ్‌ రావు మధ్య వాడీవేడి సంభాషణ సాగింది. హరీశ్‌ రావు డిప్యూటీ లీడరా? ఎమ్మెల్యేనా?.. ఏ హోదాలో మాట్లాడుతున్నారు? అని కోమటిరెడ్డి ప్రశ్నించారు. ప్రతిపక్ష నేత ఏడాదిగా సభకు రాకపోవడం సభకే కాదు.. తెలంగాణ ప్రజలను అవమానపరచడమే అని కోమటిరెడ్డి మండిపడ్డారు.

  • 19 Dec 2024 11:08 AM (IST)

    అసెంబ్లీని ముట్టడించిన మాల మహానాడు ప్రతినిధులు:

    మాల మహానాడు ప్రతినిధులు అసెంబ్లీని ముట్టడించారు. వారిని పోలీసులు అరెస్టు చేశారు. అసెంబ్లీలో మాదిగ కులస్తులకు మద్దతుగా సీఎం రేవంత్ వ్యాఖ్యలకు నిరసనగా మాల మహానాడు ప్రతినిధులు ముట్టడించారు.

  • 19 Dec 2024 10:42 AM (IST)

    సీఎం మా జిల్లాకు అండగా ఉన్నారు:

    సభలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతున్నారు. 'నల్గొండలో ఎమ్మెల్యే, ఎంపీగా పోటీ చేసిన మా వాళ్లు భారీ మెజార్టీతో గెలిచారు. గత ప్రభుత్వం నల్గొండ జిల్లాను పట్టించుకోలేదు. గందమల్ల రిజర్వాయర్ పనులు పక్కన పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డి మా జిల్లాకు అండగా ఉన్నారు. ఆయనకు ధన్యవాదాలు' అని కోమటిరెడ్డి అన్నారు.

  • 19 Dec 2024 10:38 AM (IST)

    ఫ్లకార్డుల ప్రదర్శన వద్దు:

    సభ నియమాలు పాటించాలని సభ్యులను స్పీకర్ కోరారు. ఫ్లకార్డుల ప్రదర్శన వద్దని, మనం రూపొందించుకున్న నిబంధనలు మనమే ఉల్లంగించవద్దన్నారు.

  • 19 Dec 2024 10:27 AM (IST)

    అసెంబ్లీకి ఆకుపచ్చ కండువాలతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు:

    రైతాంగ సమస్యలపై రైతు కండువాలు వేసుకొని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీలోకి వచ్చారు. రైతు రుణమాఫీ, రైతు భరోసా, బోనస్‌పై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీయాలని ఎమ్మెల్యేలు నిర్ణయించుకున్నారు.

  • 19 Dec 2024 10:18 AM (IST)

    బీజేపీ వాయిదా తీర్మానం:

    అసెంబ్లీ సమావేశాలు ఐదో రోజుకు చేరుకున్నాయి. 317 జీవో, ఉద్యోగులను సొంత జిల్లాలకు పంపే అంశంపై శాసనసభలో బీజేపీ వాయిదా తీర్మానం కోరింది.

  • 19 Dec 2024 10:06 AM (IST)

    శాసన మండలి ప్రారంభం:

    తెలంగాణ శాసన మండలి ప్రారంభమైంది. సభలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి.

  • 19 Dec 2024 09:33 AM (IST)

    అసెంబ్లీకి చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి:

    సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీకి చేరుకున్నారు. అసెంబ్లీ కమిటీ హల్లో కాసేపట్లో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలతో సీఎం సమావేశం కానున్నారు.

  • 19 Dec 2024 09:28 AM (IST)

    అసెంబ్లీలో బీఆర్ఎస్ వాయిదా తీర్మానం:

    రాష్ట్రంలోని రైతులకు పూర్తిగా రుణ మాఫీ చేయాలని, పంట సాయం రూ.15 వేలు ఇచ్చే అంశంపై చర్చించాలని అసెంబ్లీలో బీఆర్ఎస్ వాయిదా తీర్మానం కోరనుంది.

  • 19 Dec 2024 09:07 AM (IST)

    ఎడ్ల బండిపై అసెంబ్లీకి ఎమ్మెల్యేలు:

    బీజేపీ ఎమ్మెల్యేలు ఎడ్ల బండిపై అసెంబ్లీకి రానున్నారు. రైతు హమీలు అమలు చేయలేదని నిరసనగా ఎడ్ల బండిపై అసెంబ్లీకి వస్తున్నారు. ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ ఆఫీస్‌ నుంచి ఎడ్ల బండిపై అసెంబ్లీకి రానున్నారు. నిన్న రైతు హామీలపై చర్చించాలని వాయిదా తీర్మానం బీజేపీ కోరగా.. ఆ తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించారు.

  • 19 Dec 2024 09:05 AM (IST)

    గంట ముందుగానే అసెంబ్లీకి సీఎం:

    అసెంబ్లీ కమిటీ హాల్‌లో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలతో సీఎం రేవంత్ భేటీ నిర్వహించనున్నారు. గంట ముందుగానే అసెంబ్లీకి రానున్న సీఎం.. కీలకాంశాలపై సభ్యులకు దిశానిర్దేశం చేయనున్నారు. ఇవాళ అసెంబ్లీలో భూ భారతి, రైతు భరోసాపై చర్చ జరగనుంది.

  • 19 Dec 2024 09:03 AM (IST)

    నాలుగు ప్రభుత్వ బిల్లులు:

    నేడు అసెంబ్లీలో నాలుగు ప్రభుత్వ బిల్లులతో సహా భూభారతి బిల్లుపై చర్చ కొనసాగనుంది. తెలంగాణ మున్సిపాలిటీ సవరణ బిల్లు, గ్రేటర్ హైదరాబాద్‌ మున్సిపల్ కార్పొరేషన్‌ బిల్లు, తెలంగాణ పంచాయతీరాజ్ సవరణ బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. నేడు అసెంబ్లీలో ప్రభుత్వ అప్పులు, చెల్లింపులపై సహా రైతు భరోసాపై చర్చ జరగనుంది.

Show comments