Telangana Education: రాష్ట్ర బడ్జెట్‌లో విద్యారంగానికి 9 శాతం ఖర్చు చేస్తున్నాం: సీఎం రేవంత్ రెడ్డి

Cm Revantrh Reddy

Cm Revantrh Reddy

తెలంగాణను విద్యాపరంగా అగ్రగామిగా నిలబెట్టేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. విద్యారంగాన్ని పూర్తిస్థాయిలో బలోపేతం చేసేందుకే రాష్ట్ర బడ్జెట్‌లో ఏకంగా 9 శాతం నిధులను ఖర్చు చేస్తున్నామని వెల్లడించారు. ఓట్ల రాజకీయం కోసం కాకుండా, పిల్లల బంగారు భవిష్యత్తును దిద్ది తీర్చాలనే ఏకైక లక్ష్యంతోనే విద్యాశాఖ బాధ్యతలను తాను స్వయంగా పర్యవేక్షిస్తున్నానని తెలిపారు. గతంలో ఉన్నవారు ఇరిగేషన్ శాఖను ఎంచుకుంటే, నేను విద్యాశాఖ బాధ్యతను నా వద్దే ఉంచుకున్నా. 80 వేల పుస్తకాలు చదివానన్న నాయకుడి కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయింది. కానీ నా ప్రాధాన్యత ప్రాజెక్టులు కావు, పిల్లల చదువులే అని సీఎం అన్నారు. లక్షల మంది ఇంజనీరింగ్ పట్టాలు పొందుతున్నా, ఉద్యోగానికి దరఖాస్తు రాసుకోలేని పరిస్థితి రాకూడదని, విద్యా ప్రమాణాలను పెంచడమే తమ నైతిక బాధ్యత అని స్పష్టం చేశారు.

చిన్నతనంలోనే పిల్లలను హాస్టళ్లలో వేయడం వల్ల కుటుంబ సంబంధాలు దెబ్బతింటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఒంటరిగా పెరిగే పిల్లలు పెద్దయ్యాక తల్లిదండ్రులను వృద్ధాశ్రమాలకు పంపే ప్రమాదం ఉందన్నారు. పాఠశాలల్లో ఉపాధ్యాయులే తల్లిదండ్రుల స్థానంలో ఉండి పిల్లలకు సరైన మార్గదర్శనం చేయాలని పిలుపునిచ్చారు. ప్రత్యామ్నాయంగా, ప్రతి మండలాన్ని ఒక క్లస్టర్‌గా తీసుకుని విద్యా ప్రణాళికలు తయారు చేయాలని సూచించారు.

ఉపాధ్యాయులకు విదేశీ శిక్షణ..
విద్యాబోధనలో అంతర్జాతీయ ప్రమాణాలు అందించేందుకు ఏటా 10 నుండి 12 మంది ఉపాధ్యాయులను ‘స్టడీ లీవ్’పై విదేశాలకు పంపిస్తామని ప్రకటించారు. టీచర్ల ప్రమోషన్లు, బదిలీల బాధ్యతను తానే చూసుకుంటానని, అడగకుండానే ఒకటో తేదీన జీతాలు వేస్తున్నామని గుర్తుచేశారు. ఇదే క్రమంలో తన రాజకీయ ప్రస్థానంపై స్పందిస్తూ “2034 వరకు ఈ రాష్ట్రానికి నేనే సీఎంగా ఉంటాను, ఎలాంటి సందేహాలు వద్దు” అని ధీమా వ్యక్తం చేశారు.