Techie Jobs At Risk: భారతదేశంలో ఐటీ రంగం, వైట్ కాలర్ ఉద్యోగాలు తీవ్రమైన ముప్పును ఎదుర్కొంటున్నాయని ఎకనామిక్ సర్వే 2025-26 హెచ్చరించింది. జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) ప్రభావంతో ఐటీ రంగంలోని ఉద్యోగులు రిస్క్‌లో ఉన్నారంటూ చెప్పింది. ఇప్పటి వరకు సాధారణ మేధోపనులకు భారతీయుల్ని అవుట్సోర్స్గా నియమించుకున్న విదేశీ కంపెనీలు, ఇప్పుడు వీటిని ఏఐ ద్వారా భర్తీ చేస్తుండటంతో ‘‘నిశ్శబ్ధమైన మార్పు’’ జరుగుతోందని సర్వే పేర్కొంది.
ఈ పరిణామాలను అంచనా వేయడానికి అమెరికాలోని ప్రొఫెషనల్, బిజినెస్ అండ్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్(PBIS) రంగాన్ని ముందస్తు సూచికగా (లీడ్ ఇండికేటర్)గా ఉపయోగించింది. డిసెంబర్ 2022 తర్వాత ప్రొడక్టీవ్ ఏఐ టూల్స్ వాడకం మొదలైన తర్వాత, జీడీపీ వృద్ధి పెరుగుతుంటే, దీనికి అనుగుణంగా ఉద్యోగాల వృద్ధి జరగడం లేదని గుర్తించింది. ఉద్యోగాల సృష్టి-వృద్ధి మధ్య అనుసంధానం సరిగా లేదని చెప్పింది. దీనిని ‘‘వీకన్డ్ మార్జినల్ రెస్పాన్సివ్నెస్’’గా పేర్కొంది. దీని అర్థం ‘‘ఉత్పత్తి లేదా ఆర్థిక వృద్ధి పెరిగిన ప్రతీసారి ఉద్యోగాలు పెరుగుతాయనే సంప్రదాయ సంబంధం బలహీన పడింది’’ అని సర్వే చెప్పింది.
Read Also: Janasena MLA Arava Sridhar Incident: జనసేన ఎమ్మెల్యేపై లైంగిక ఆరోపణలు.. విచారణ ప్రారంభం..
ఇది ఆకస్మిక పతనం కాదని ‘‘స్థిరమైన తగ్గుదల’’గా అభివర్ణించింది. ఇది ఇన్ఫర్మేషన్ రిట్రీవల్, సమరైజేషన్, రిపీటిటీవ్ బిజినెస్ టాస్క్‌లతో ముడిపడి ఉన్న ఉద్యోగాలను ప్రభావితం చేస్తుందని చెప్పింది. తక్కువ డిజిటలైజేషన్ ఉన్న రంగాల్లో ఇలాంటి ధోరణులు కనిపించలేదని, కానీ వైట్ కాలర్, ఏఐ పనిచేసే రంగాల్లోని ఉద్యోగాలకే పరిమితమైందని సర్వే చెప్పింది. ఏఐ వల్ల ఖర్చులు తగ్గడం వల్ల ఈ రంగాలు ఆటోమేషన్ వైపు వెళ్తున్నాయని చెప్పింది. ఉద్యోగుల్ని నియమించుకోవడం కన్నా ఆటోమేషన్‌కు ప్రాధానత ఇస్తున్నాయి. దీంతో క్యాపిటల్-లేబర్ సమతుల్యం మారిపోతోంది.
భారత ఐటీ మోడల్‌కు పెనుముప్పు..
తక్కువ ఖర్చుతో నాణ్యమైన ఐటీ సేవలు ఇవ్వడంలో ప్రపంచంలోనే భారత్‌కు పేరుంది. ఇలాంటి సర్వీసులతో భారత్ దశాబ్ధాలుగా లాభపడింది. కానీ ఇప్పుడు ఇదే పనిని ఏఐ మరింత వేగంగా, తక్కువ ఖర్చుతో చేస్తోంది. భారతదేశం ఆధారపడిన సంప్రదాయ బ్యా్క్ – ఆఫీస్ మోడల్ ఇప్పుడు తీవ్ర ముప్పులో ఉందని సర్వే స్పష్టం చేసింది. ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం జోక్యం అవసరమని ఎకనామిక్ సర్వే సూచించింది. ఏఐ ఎకనామిక్ కౌన్సిల్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. ఏఐ వల్ల ఉద్యోగాలపై పడే ప్రభావాన్ని అంచనావేయడం, ఉపాధిని కాపాడేలా ఏఐ వినియోగానికి మార్గదర్శకాలు రూపొందించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పింది.