NTV Telugu Site icon

IND vs BAN: 92 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో ఇదే తొలిసారి.. భారత్‌కు ప్రత్యేకంగా చెన్నై టెస్ట్!

India Test History

India Test History

Team India Creates History in 92 Years Test Cricket: టెస్టు క్రికెట్ చరిత్రలో భారత్‌ జట్టు అరుదైన ఘనతను ఖాతాలో వేసుకుంది. 92 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో తొలిసారిగా భారత జట్టు ఓటముల కంటే.. ఎక్కువ విజయాలు సాధించింది. చెన్నై వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులో ఘన విజయం సాధించడంతో టీమిండియాకు ఈ మ్యాచ్ చిరస్మరణీయంగా మారింది. అంతేకాదు అత్యధిక టెస్టు విజయాలు నమోదు చేసిన నాలుగో జట్టుగా టీమిండియా నిలవడం విశేషం.

భారత జట్టు 1932లో టెస్టుల్లో అరంగేట్రం చేసింది. బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌ను కలుపుకొని ఇప్పటివరకు 580 టెస్టులు ఆడింది. ఇందులో 179 విజయాలు ఉండగా.. 178 ఓటములు ఉన్నాయి. 222 మ్యాచ్‌లు డ్రా కాగా.. ఓ మ్యాచ్ టై అయింది. 92 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో పరాజయాల కంటే గెలుపులే అధికం కావడం ఇదే ప్రథమం. దాంతో చెన్నై టెస్ట్ మ్యాచ్ టీమిండియాకు ప్రత్యేకంగా నిలిచింది. ఫాన్స్ భారత జట్టుకు అభినందనలు తెలుపుతున్నారు.

Also Read: IND vs BAN: ఆరేసిన అశ్విన్.. బంగ్లాపై భారత్‌ ఘన విజయం! పాకిస్తాన్‌లా కాదు

92 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో భారత జట్టుకు 36 మంది సారథులుగా వ్యవహరించారు. భారత జట్టుకు మొదటి టెస్ట్ కెప్టెన్‌ సీకే నాయుడు కాగా.. ప్రస్తుత కెప్టెన్‌ రోహిత్‌ శర్మ. ప్రతిఒక్కరూ జట్టుని ముందుండి నడిపించి ఎన్నో విజయాలను, మరెన్నో జ్ఞాపకాలనూ అందించారు. 92 ఏళ్లలో 314 మంది క్రికెటర్లు టెస్ట్‌ మ్యాచ్‌లు ఆడారు. 1932 జూన్‌ 25న అమర్‌సింగ్‌ మొదటి టెస్ట్ క్యాప్ అందుకోగా.. 2024 మార్చి 7న దేవదత్‌ పడిక్కల్ చివరిసారిగా టోపీ అందుకున్నాడు. ఇన్నేళ్లలో కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్, దిలీప్ వెంగ్ సర్కార్, మొహమ్మద్ అజారుద్దీన్, సచిన్ టెండ్యూలర్, రాహుల్ ద్రవిడ్, సౌరవ్ గంగూలీ, అనిల్ కుంబ్లే, వీవీఎస్ లక్ష్మణ్, హర్భజన్ సింగ్, ఎంఎస్ ధోనీ, ఆర్ అశ్విన్, విరాట్ కోహ్లీ, చటేశ్వర్ పుజారా లాంటి ఎందరో టెస్టుల్లో తనదైన ముద్ర వేశారు.