Site icon NTV Telugu

Team India Test Coach: టీమిండియా టెస్ట్ జట్టు కోచ్గా వీవీఎస్ లక్ష్మణ్..?

Vvs

Vvs

Team India Test Coach: గౌతమ్ గంభీర్ 2024లో భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత.. టీ20, వన్డే ఫార్మాట్లలో జట్టు ఆశాజనక విజయాలు సాధించినప్పటికీ.. టెస్టు క్రికెట్‌లో మాత్రం గంభీర్ హయాంలో భారత్‌కు నిరాశే మిగిలింది. స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన మూడు మ్యాచుల టెస్టు సిరీస్‌లో జట్టు అనూహ్య పరాజయాన్ని చవిచూసింది. ప్రత్యర్థి టీం భారత్‌ను 3-0తో క్లీన్ స్వీప్ చేసి.. టీమిండియా టెస్టు క్రికెట్ చరిత్రలోనే వైట్‌వాష్ అపజయాన్ని మూటగట్టుకుంది.

Read Also: Indian Young Athletes: క్రికెట్ నుంచి చెస్ వరకు.. 2025లో ప్రపంచ వేదికలపై భారతీయ యువ ప్లేయర్ల ఆధిపత్యం

అయితే, ఈ పరాజయాన్ని అభిమానులు ఇంకా మర్చిపోకముందే.. తాజాగా దక్షిణాఫ్రికా కూడా భారత్‌ను 2-0తో వైట్‌వాష్ చేసింది. ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో భారత్ 2-2తో డ్రా చేసి కొంత పోటీ చూపించినప్పటికీ.. గంభీర్ కోచ్‌గా వచ్చిన తర్వాత భారత్ టెస్టుల్లో సాధించిన సిరీస్ విజయాలు కేవలం బంగ్లాదేశ్, వెస్ట్ ఇండీస్ వంటి జట్లై మాత్రమే అని చెప్పాలి. వరుస సిరీస్ ల ఓటములతో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మాజీ దిగ్గజ బ్యాటర్ వీవీఎస్ లక్ష్మణ్‌ను బీసీసీఐ సంప్రదించి, రెడ్ బాల్ జట్టుకు కోచ్‌గా బాధ్యతలు స్వీకరించాలని కోరినట్లు తెలుస్తుంది. అయితే, ప్రస్తుతం బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో హెడ్ ఆఫ్ క్రికెట్‌గా ఉన్న లక్ష్మణ్.. ఆ బాధ్యతలో సంతృప్తిగా ఉన్నట్లు, సీనియర్ టెస్టు జట్టుకు కోచింగ్ చేయడంపై ఇంట్రెస్ట్ చూపలేదని తెలుస్తుంది.

Read Also: Guntur Midnight Chaos: గుంటూరులో అర్థరాత్రి యువకుల వీరంగం.. నడి రోడ్డుపై దారుణం

కాగా, గౌతమ్ గంభీర్ భారత వైట్ బాల్ జట్ల కోచ్‌గా ఐసీసీ, ఏసీసీ ట్రోఫీలతో మంచి రికార్డు ఉన్నప్పటికీ, టెస్టు ఫార్మాట్‌లో పరిస్థితి భిన్నంగా ఉంది. ముఖ్యంగా సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా దేశాలపై 10 టెస్టు పరాజయాలు గంభీర్‌ ఖాతాలో పడటంతో విమర్శలకు దారి తీస్తుంది. అయితే, గంభీర్‌ 2027 వన్డే ప్రపంచకప్ వరకు బీసీసీఐ కాంట్రాక్ట్ ఉంది.. కానీ, త్వరలో టీ20 ప్రపంచకప్‌లో భారత ప్రదర్శన ఆధారంగా ఈ ఒప్పందంపై తిరిగి సమీక్ష జరిగే ఛాన్స్ ఉందని బోర్డు వర్గాలు సూచిస్తున్నాయి. ప్రస్తుతం 2025- 27 వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ సైకిల్‌లో మిగిలిన తొమ్మిది టెస్టులకు గంభీర్ టెస్టు కోచ్‌గా ఉంచాలా? వద్దా? అనే అంశంపై బీసీసీఐ తీవ్రంగా చర్చలు కొనసాగిస్తుంది.

Exit mobile version