పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో కూటమి నేతల మధ్య ఏర్పడిన విభేదాలకు చెక్ పెట్టే పనిలో ఇరు పార్టీల పెద్దలు రంగంలో దిగినట్టు తెలుస్తోంది. విజయవాడలో తాడేపల్లిగూడెంకు చెందిన టీడీపీ ఇంచార్జి వలవల బాబ్జి, జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్‌లతో సమన్వయ కమిటీ భేటీ నిర్వహించింది. ఇద్దరి మధ్య ఏర్పడిన విభేదాలను పక్కన పెట్టి పనిచేయాలని పార్టీ పెద్దలు సూచించినట్లు సమాచారం.
తాడేపల్లిగూడెంలో జనసేన, టీడీపీ మధ్య విభేదాలేమీ లేవని.. ప్రజల సంక్షేమం కోసం టీడీపీ-జనసేన కలిసి పనిచేస్తాయని తెలుగు దేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ స్పష్టం చేశారు. తనతో పాటు తిరిగే కొంతమంది టీడీపీ నేతలు తన చావు కోసం ఎదురుచూస్తున్నారు అంటూ తాడేపల్లిగూడెం జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఈ సమన్వయ భేటీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
Also Read: CBG Plant: ఏపీలో సీబీజీ ప్లాంటు ఏర్పాటుకు ముందుకొచ్చిన ఆర్వెన్సిస్ గ్రూప్!
తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ బుధవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. తనతో ఉన్న కొంతమంది నాయకులే తాను చనిపోవాలని కోరుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను చనిపోతే ఉప ఎన్నిక వస్తుందని, ఉప ఎన్నికలో గెలిచి ఎమ్మెల్యే కావాలని కోరుకుంటున్నారన్నారు. ప్రధాని మోడీ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఆశీస్సులతో తనకు తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే టికెట్ వచ్చిందని.. ప్రజలు ఆశీర్వదించి అత్యధిక మెజారిటీతో గెలిపించారన్నారు. ఎవరి త్యాగాల వల్ల తనకు ఎమ్మెల్యే సీటు రాలేదని, మూడు పార్టీలు కలిపి తనకు విజయాన్ని కట్టెబెట్టాయన్నారు. ఎమ్మెల్యేగా గెలిచాక తాడేపల్లిగూడెం నియోజకవర్గ ప్రజల కోసం పనిచేస్తున్నానని బొలిశెట్టి శ్రీనివాస్ చెప్పారు.
