NTV Telugu Site icon

TDP 2nd List: రేపు టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా.. చంద్రబాబు కీలక ప్రకటన

Tdp 2nd List

Tdp 2nd List

TDP 2nd List: టీడీపీ ఇటీవల 94 మందితో అసెంబ్లీ అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇవాళ చంద్రబాబు మాట్లాడుతూ, వీలైనంత మంది టీడీపీ అభ్యర్థులతో రెండో జాబితాను రేపు ప్రకటిస్తామని వెల్లడించారు. టీడీపీ అభ్యర్థుల జాబితా కసరత్తులు తుది దశకు చేరుకున్నాయని ఆయన వెల్లడించారు. జనసేన, బీజేపీ ఎక్కడెక్కడ పోటీ చేయాలన్నదానిపై ఆ రెండు పార్టీల వారికి స్పష్టత ఉందన్నారు. సమయానుకూలంగా ఆ రెండు పార్టీలు కూడా వారి అభ్యర్థులను ప్రకటిస్తాయని స్పష్టం చేశారు. ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి అనే ఉద్దేశంతో బీజేపీ, జనసేన పార్టీలతో పొత్తులు పెట్టుకున్నామని స్పష్టం చేశారు.

Read Also: Hyderabad Liberation Day: సెప్టెంబర్ 17న ‘‘హైదరాబాద్ విమోచన దినోత్సవం’’.. అమిత్ షా ప్రకటన..

“పొత్తులు ఎందుకు పెట్టుకోవాలి అని ప్రతివాళ్లు ప్రశ్నిస్తున్నారు. బీజేపీ పదేళ్లుగా కేంద్రంలో ఉంది. రేపటి ఎన్నికల్లోనూ బీజేపీనే వస్తుందని అందరూ చెబుతున్నారు. దక్షిణాదిలో ఎక్కువ సీట్లు రాకపోయినా, ఉత్తరాదిలో వారిదే ప్రభంజనం అంటున్నారు. రాష్ట్రంలో ఇప్పుడు జరిగిన విధ్వంసంతో 30 ఏళ్లు వెనక్కివెళ్లిపోయాం. రాష్ట్రాన్ని పునర్ నిర్మించాలంటే… నిధులు, అనుమతులు, క్లియరెన్సులు ఇలా అన్ని విధాలుగా కేంద్ర ప్రభుత్వ సహకారం తప్పనిసరిగా అవసరం. ఒకవేళ ఇక్కడ నేను గెలిచినా కేంద్రం సహకారం లేకపోతే రాష్ట్ర పునర్ నిర్మాణం చేయలేం. కొందరు… టీడీపీ-జనసేన పొత్తును ప్రశ్నిస్తున్నారు. మేం జనసేనతో పొత్తు పెట్టుకోకపోతే ఓట్లు చీలిపోయి మళ్లీ వీళ్లే గెలుస్తారు… రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది. సీట్ల పంపకం అయిపోయిన తర్వాత కూడా… ఎప్పుడు లేనంత తక్కువ సీట్లు తీసుకున్నారంటూ జనసేన పార్టీని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీ జాతీయ పార్టీ… మీకు ఇన్ని సీట్లేనా అంటూ బీజేపీ వాళ్లను రెచ్చగొడుతున్నారు. ఆరోజు పవన్ కల్యాణ్ కూడా చెప్పింది… ఓటు చీలకూడదు అని స్పష్టం చేశాడు. నేను కూడా గర్వానికి పోలేదు. నేను 14 ఏళ్లు సీఎంగా చేశాను, కేంద్రంలోనూ చక్రం తిప్పాం. నేను ఎక్కడికీ పోను, ఎవరితోనూ సర్దుబాటు చేసుకోను అని భీష్మించుకు కూచుంటే ఎవరికి లాభం? అందుకే ప్రజాహితం కోసం, ప్రజల భవిష్యత్ కోసం అందరం రాజీపడ్డాం. ఇది రాష్ట్ర హితం కోసం కుదుర్చుకున్న పొత్తు తప్ప, వ్యక్తిగత ప్రయోజనాల కోసమో, రాజ్యాధికారం కోసమో కుదుర్చుకున్న పొత్తు కాదు” అని చంద్రబాబు స్పష్టం చేశారు.