Kanakamedala Ravindra Kumar: రైతు వ్యతిరేక ప్రభుత్వాన్ని, రైతుల్ని వంచించిన సీఎం జగన్ రెడ్డిని ఇంటికి సాగనంపితేనే రాష్ట్ర రైతాంగానికి మంచి రోజులు వస్తాయన్నారు టీడీపీ రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్ర కుమార్.. టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. జగన్మోహన్ రెడ్డి అనాలోచిత నిర్ణయాలు, వైసీపీ ప్రభుత్వ విధానాలతో రాష్ట్ర రైతాంగం కోలుకోలేని విధంగా దెబ్బతిందన్నారు. కరువు మండలాల ప్రకటన, కేంద్ర ప్రభుత్వం నుంచి కరువు సాయం పొందడంలో జగన్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించింది. వ్యవసాయరంగం, రైతుల్ని ఆదుకోవడంలో జగన్ కేవలం మాటల మనిషిగానే మిగిలిపోయాడు. రైతు ఆత్మహత్యల్లో రాష్ట్రాన్ని దేశంలో 3వ స్థానంలోనిలిపిన జగన్ రెడ్డి, రైతుల అప్పుల్లో కూడా ఏపీని అగ్రస్థానంలో నిలిపాడని విమర్శించారు.
Read Also: Harish Rao: గవర్నర్ పై మాజీ మంత్రి ఆరోపణలు.. మీరే చేశారు..!
రాష్ట్ర ప్రభుత్వం అనుసరించిన రైతు వ్యతిరేక విధానాలతో రాష్ట్రంలో సుమారు 93.2 శాతం రైతు కుటుంబాలు అప్పుల పాలయ్యాయని ఆవేదన వ్యక్తం చే శారు రవీంద్రకుమార్.. టీడీపీ ప్రభుత్వంలో 73 శాతం పూర్తైన పోలవరం ప్రాజెక్ట్, ఇతర సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణను జగన్ సర్కార్ పట్టించుకోకపోవడంతో రాష్ట్రంలో తీవ్ర దుర్భిక్షం నెలకొంది. ప్రకృతి విపత్తులు, కరువు వల్ల రాష్ట్ర రైతాంగం రూ.80 వేల కోట్లు నష్టపోయింది. ధాన్యం సేకరణలో జగన్ సర్కార్ వ్యవహరించిన తీరుతో వరిరైతులు 5 ఏళ్లలో రూ. 21 వేల కోట్లు నష్టపోయారు. విద్యుత్ సబ్సిడీ ధర పెంపుతో ఆక్వా రైతులు రూ. 10 వేల కోట్లు, సకాలంలో నాణ్యమైన విత్తనాలు, ఎరువులు లేక రైతాంగం రూ. 10 వేల కోట్లు నష్టపోయిందని గణాంకాలు వెల్లడించారు. చంద్రబాబు పాలనలో ఖరీఫ్, రబీ సీజన్లలో కోటి 42 ఎకరాలు సాగైతే, జగన్ రెడ్డి హాయాంలో 2023-24లో రెండు సీజన్లలో కూడా కేవలం 30 లక్షల ఎకరాలు మాత్రమే సాగైందన్నారు. టీడీపీ ప్రభుత్వం 5 ఏళ్లలో ప్రాజెక్టుల నిర్మాణం, రైతులకు యాంత్రీకరణ పరికరాల కోసం రూ.65 వేల కోట్లు ఖర్చుచేస్తే, జగన్ రెడ్డి ప్రభుత్వం కేవలం రూ. 30 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేసిందన్నారు. ఏటా ఒక్కో రైతుకి రూ.12,500లు రైతుభరోసా సాయం ఇస్తానన్న జగన్ రెడ్డి, చివరకు రూ.7,500లు మాత్రమే ఇచ్చి, ఒక్కో రైతుకి 5 ఏళ్లలో రూ.25వేల వరకు ఎగ్గొట్టాడని ఆరోపించారు. చంద్రబాబు రైతు రుణమాఫీ, అన్నదాతా సుఖీభవ కింద ఒక్కోరైతుకి రూ.లక్ష వరకు అర్థిక సహాయం అందిస్తే, జగన్ రెడ్డి కేవలం రూ. 37,500లతో సరిపెట్టాడు. రైతు వ్యతిరేక ప్రభుత్వాన్ని, రైతుల్ని వంచించిన జగన్ రెడ్డిని ఇంటికి సాగనంపితేనే రాష్ట్ర రైతాంగానికి మంచి రోజులు వస్తాయని వ్యాఖ్యానించారు టీడీపీ రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్ర కుమార్.